ఆలోచింపజేసే జనగణమన

ఆలోచింపజేసే జనగణమన

మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్‌‌, సూరజ్ వెంజరమూడు కలిసి నటించిన చిత్రం ‘జనగణమన’. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పృథ్విరాజ్ ప్రొడక్షన్స్, మ్యాజిక్ ఫ్రేమ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.  నిన్న ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పృథ్విరాజ్... ‘చెవిటివారు వినాలంటే శబ్దం చాలా పెద్దదిగా ఉండాలి’ అనే భగత్ సింగ్‌‌ మాటని కోట్ చేశాడు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఓ సంఘటనలో అనుకోకుండా పోలీసుల వల్ల గాయపడతాడు పృథ్విరాజ్. దెబ్బ తిన్న కాలును బాగు చేసుకోడానికి ప్రభుత్వ సహాయం కోరేందుకుగాను ఓ రాజకీయ నాయకుడిని కలుస్తాడు. పోలీసుల క్రూరత్వం వలన తనకి నష్టం కలిగిందని, నష్ట పరిహారం ఇప్పించమని అడుగుతాడు. నీతి, నిజాయతీ, న్యాయం లాంటివన్నీ వట్టి మాటలేనని, వ్యవస్థకు ఎదురెళ్తే ఇలాగే జరుగుతుంది. ఎందుకో తెలుసా’ అంటాడా పొలిటీషియన్. అందుకు బదులిస్తూ ‘తెలుసు సర్. ఇక్కడ నోట్లు నిషేధించొచ్చు. అవసరమైతే ఓట్లు కూడా నిషేధించొచ్చు. ఎవరూ అడగరు.  ఎందుకంటే ఇది ఇండియా’ అంటాడు పృథ్విరాజ్. దాన్నిబట్టి వ్యవస్థలోని పలు సమస్యల్ని ఇందులో చర్చించినట్టు అర్థమవుతోంది. ఓ మంచి ట్విస్ట్‌‌తో ట్రైలర్‌‌‌‌ను ముగించి సినిమాపై ఆసక్తిని పెంచారు. ముఖ్యంగా పృథ్విరాజ్ ఇంటెన్స్‌‌ నటన ఆకట్టుకుంది. వచ్చే నెల 28న ఈ సినిమా విడుదల కానుంది.