ఆక్సిజన్ అందక 11 మంది చనిపోవడం విషాదకరం

ఆక్సిజన్ అందక 11 మంది చనిపోవడం విషాదకరం

రుయాలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం

తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకపోవడం మూలంగా 11 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారనే వార్త తీవ్ర ఆవేదనను కలిగించింది. ఊపిరి అందించే వాయువుని సక్రమంగా అందించని దుస్థితి నెలకొనడం వల్లే అత్యంత విషాదకరమైన ఈ ఘటన చోటు చేసుకొంది. రాయలసీమ ప్రజల  వైద్య అవసరాలకు కేంద్రమైన రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా, వైద్యపరమైన మౌలిక వసతులు సరిగా లేవని రోగులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని అందరూ చెబుతున్నారు. కర్నూలు, హిందూపురంల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ రోగులు ఆక్సిజన్ సరఫరా అందక చనిపోయారు. అయినప్పటికీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకోలేదు. ఇలాంటి విపత్కర సమయంలో విమర్శలు చేయకూడదని సంయమనం పాటిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా తక్షణమే పరిస్థితులను చక్కదిద్దాలి. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి విషాదకర ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలి’ అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు.