
డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా జులై 24న విడుదలైన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమా ఐదేళ్ల నిరీక్షణ తర్వాత విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ క్రమంలో జనసేన క్యాడర్ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యతలు తీసుకుంది. రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ హరిహర వీరమల్లు ఆధ్వర్యంలో ఫ్రీషో ప్రదర్శించారు.
ఇవాళ ( జూలై 27 ) 9, 10, ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థుల కోసం కోరుకొండ, సీతానగరంలో రామకృష్ణ థియేటర్, గీతా సినిమాస్ నందు హరిహర వీరమల్లు సినిమా రెండు ఫ్రీ షోలు ప్రదర్శించారు.రాజానగరంలో ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఫ్రీషో వేసినట్లు తెలిపారు ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ. హరిహర వీరమల్లు సినిమాను పార్టీ క్యాడర్ జనాల్లోకి తీసుకెళ్లాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల నేపథ్యంలో ఫ్రీషో ప్రదర్శించినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేల ద్వారా సినిమా ఫ్రీషో ప్రదర్శించటం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ముందుండి సినిమాను ప్రమోట్ చేయటం ఏంటని ప్రతిపక్ష వైసీపీ విమర్శిస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సినిమా నిర్మాతకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు వైసీపీ శ్రేణులు.