తెలంగాణలో జనసేన దారెటు?

తెలంగాణలో జనసేన దారెటు?
  • వచ్చే ఎన్నికలపై ఇంకా దృష్టి పెట్టని పవన్
  • 32 చోట్ల పోటీ చేస్తమని గతంలో  ప్రకటన
  • తొమ్మిది నెలలుగా యాక్టివ్‌గా లేని కేడర్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో  జనసేన పార్టీ జాడే కనిపించడం లేదు. రాష్ట్రంలో తాము 32 స్థానాల్లో  పోటీకి సిద్ధంగా ఉన్నామని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గతంలో ప్రకటించారు. కానీ ఇప్పటిదాగా ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై, పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టలేదు. దీంతో రాష్ట్రంలో  ఆ పార్టీ దారి ఎటు సాగుతున్నదో అంతు పట్టకుండా ఉంది. ఇప్పుడిప్పుడే ఏపీలో  జనసేనకు మంచి ఊపు వస్తున్నది. అందువల్ల ఏపీని వదిలి ఉన్నపళంగా తెలంగాణలో  పోటీ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకని జనసేన భావిస్తున్నట్లుగా  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో  పోటీకి సిద్ధమని ప్రకటించినప్పటికీ ఏపీకే పవన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణలో పోటీ చేసి దెబ్బతినే బదులు ఏపీకే పరిమితమవ్వాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తున్నది.  

9 నెలలుగా సైలెంట్.. 

రాష్ట్ర జనసేన పార్టీలో  స్తబ్దత కొనసాగుతున్నది. 9 నెలల క్రితం జనవరి 24న పవన్‌ కల్యాణ్‌.. తన ప్రచార రథం వారాహి వాహనానికి కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ రోజే రాష్ట్రంలో జనసేన పార్టీ హడావుడి కొంత కనిపించింది. ఆ తరువాత పార్టీ జెండాగాని, పార్టీ నేతలు, కార్యకర్తలు గాని కనిపించిన దాఖలాలు లేవు. దీంతో జనసేన ఏపీ దాటి రాష్ట్రానికి వస్తుందా లేదా  అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలు,  సెకండ్ గ్రేడ్ కేడర్ యాక్టివ్ గా కనిపించడం లేదు. 

ఫోకసే పెట్టలే..

రాష్ట్రంలో జనసేన పార్టీ పరిస్థితిపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ అసలు ఫోకస్ పెట్టడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాలు చేపట్టాయి. కానీ జనసేన ఇప్పటి వరకు అభ్యర్థుల ప్రకటన, ప్రచార కార్యక్రమాలు చేపట్టలేదు. దివంగత ప్రజా వాగ్గేయకారుడు గద్దర్‌ ను హాస్పిటల్‌లో పరామర్శించిన పవన్..  గద్దర్‌ మరణం తర్వాత ఆయనతో  తనకున్న సాన్నిహిత్యాన్ని తెలుపుతూ  సోషల్‌ మీడియాలో  పోస్టు చేశారు. తర్వాత వారాహి యాత్రకే పరిమితమయ్యారు. 9నెలలుగా తెలంగాణలో పార్టీ కార్యక్రమాలేమీ నిర్వహించలేదు. దీంతో అసలు జనసేన రాష్ట్రంలో ఎన్నికల బరిలో నిలుస్తుందా లేదా అనే డైలమా కొనసాగుతున్నది. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్న జనసేన, తెలంగాణలో పరిస్థితిపై మాత్రం ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. 

ఏపీలో కీలకంగా..

ఏపీలో జనసేన ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తున్నది. పవన్ చేపట్టిన యాత్రలతో పార్టీకి కొంత ఊపు వచ్చింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్టు సందర్భంగా చేపట్టిన నిరసనతో  పవన్.. ఏపీ ప్రతిపక్షానికి పెద్ద దిక్కయ్యారు. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబును కలిసిన తరువాత జనసేన పార్టీ వైఖరీని స్పష్టం చేశారు. ఎన్డీఏలో కొనసాగుతూనే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి  పోటీ చేస్తామని ప్రకటించారు. ఏపీ ప్రతిపక్షంలో ఓటు చీలకుండా అధికార వైఎస్సార్‌ పార్టీని ఎదుర్కొనేందుకు పొత్తు అనివార్యమైందని వెల్లడించారు. ఇది రెండు పార్టీల మేలు కోసం తీసుకున్న నిర్ణయం కాదని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం తీసుకున్నదని చెప్పారు. 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. కానీ తెలంగాణలో పొత్తులపై, పోటీపై ఆయన ఇంకా స్పష్టమైన విధానాన్ని ప్రకటించ లేదు. ఈ నేపథ్యంలో జనసేన ఏపీకే పరిమితమతుందా..తెలంగాణలో  టీడీపీతో పొత్తుతో ఎన్నికలకు దిగుతుందా అనే డైలమా నేటికీ వీడలేదు.