
రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో జనసేన అధ్యక్షుడు పొత్తు కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతుంది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో జరుగుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేశ్‌కుమార్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికపై జనసేన పార్టీ ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో అభ్యర్ధుల గెలుపు, పార్టీ భవిష్యత్ కార్యచరణపై చర్చ జరిపింది.
ఈ భేటీలో పలువురు నేతలు జనసేన టీడీపీతో పొత్తుపెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్ తో తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్లే వైసీపీ అత్యధిక స్థానాల్లో గెలిచిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు,పవన్ కల్యాణ్ కలిసి పోటీ చేయాలని కోరారు.
బీజేపీ స్థానికంగా బలంగా లేదని మరికొందరు నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం. బీజేపీ, వైసీపీ మినహాయిస్తే.. ఇతర పార్టీలతో పొత్తుపై అధినేతతో పార్టీ నేతలు చర్చించారు. స్థానిక ఎన్నికల్లోనైనా తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని నేతలు భావిస్తున్నారు. అయితే 50 శాతం టిక్కెట్లు యువతకు కేటాయించాలని పవన్ పేర్కొన్నట్టు సమాచారం.