జనగామ అర్బన్/ బచ్చన్నపేట, వెలుగు: ఓటర్ల జాబితా సవరణకుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు. బుధవారం కలెక్టరేట్లో ఓటర్ల జాబితా సవరణపై అధికారులు, అఖిలపక్ష పార్టీ ప్రతినిధులతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే బూత్‌స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి, ఓటరు ధృవీకరణ చేపడుతున్నారని, అక్టోబర్ 29న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తామన్నారు.
జనవరి 6, 2025 న తుది ఓటరు జాబితా రూపకల్పనకు చేస్తున్నామని పార్టీ ప్రతినిధులు సహకారం అందించాలన్నారు. అంతకుముందు బచ్చన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్సందర్శించారు. రిజిష్టర్లను తనిఖీ చేసి, అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. డాక్టర్లు సీజనల్‌వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.