జనగామ జిల్లా రద్దు కాదు : మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి

జనగామ జిల్లా రద్దు కాదు :  మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి
  •     మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి

చేర్యాల, వెలుగు: జనగామ జిల్లాను రద్దు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి ఆరోపించడంలో వాస్తవం లేదని మాజీ ఎమ్మెల్యే, జనగామ నియోజకవర్గ ఇన్​చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి తెలిపారు.  మంగళవారం ఆయన చేర్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. 8 ఏండ్లు అధికార పార్టీలో ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి సహకారం అందించకపోగా జనగామ జిల్లా రద్దవుతుందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి  చేస్తున్నా అబద్ధపు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. 

రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ , బీజేపీ, సీపీఐ, సీపీఎం నాయకులు కలిసి ఉద్యమం చేస్తే ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం  43 మంది ఉద్యమ నాయకులపై కేసులు పెట్టి జైలు పాలు చేశారన్నారు. 

మీరు ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్నక్రమంలో  మీ దగ్గరికి మేమంతా వచ్చి సీఎంతో మాట్లాడి జిల్లా ఇప్పించమని కోరితే  మీరు ఎగతాళిగా మాట్లాడి జనగామ జిల్లా ఎలా వస్తుంది జిల్లా అవసరం ఏముంది ఇది సాధ్యం కాని విషయం అని మమ్మల్ని అవమానపరిచారని గుర్తుచేశారు. రాజకీయ లబ్ది కోసం తప్పుడు ప్రచారాన్ని మానుకుంటే మంచిదని హెచ్చరించారు.