
ఎన్టీఆర్‌కు జంటగా ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది జాన్వీకపూర్. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సిని మా షూటింగ్ దశలో ఉండగానే జాన్వీకపూర్ మరో సౌత్ సినిమాకు కమిట్ అయినట్టు వార్తలొస్తున్నాయి. కమల్ హాసన్ నిర్మించబోయే ఓ సినిమాతో ఆమె కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందట. ఓ వైపు హీరోగా వరుస సినిమాల్లో నటిస్తున్న కమల్.. మరోవైపు ఇతర హీరోలు, యంగ్ డైరెక్టర్స్ కాంబినేషన్‌లో సినిమాలు నిర్మిస్తున్నారు.
ఈ క్రమంలో ‘లవ్ టుడే’తో మెప్పించిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా విఘ్నేష్ శివన్ డైరెక్షన్‌లో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు కమల్. ఇందులో హీరోయిన్‌గా జాన్వీకపూర్‌ను తీసుకోబోతున్నారట. కమల్‌కి జంటగా శ్రీదేవి పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ స్నేహంతోనే ఇప్పుడు శ్రీదేవి కూతురు జాన్వీని కోలీవుడ్‌కు పరిచయం చేసే బాధ్యత కమల్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.