
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అవహేళన చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రధాని మనందరి కోసమే ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారని అన్నారు. రేపు సాయంత్రం ఐదు గంటలకు చప్పట్లు కొట్టి వైద్య సిబ్బందికి సంఘీభావం తెలుపుతూ చప్పట్లు కొట్టాలన్నారని తెలిపారు. దీన్ని కొంతమంది సోషల్ మీడియాలో అవహేళన చేస్తూ పోస్టులు పెడుతున్నారని, ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ‘ఏది ఏమైనా ఆయన మన ప్రధానమంత్రి.. ఆయనను మనం గౌరవించుకోవాలి. మన మంచి కోసమే మోడీ పని చేస్తున్నారు. ఆయనను కించపరిచేలా పోస్టులు పెడితే అరెస్టులు తప్పవు’ అని హెచ్చరించారు.
నేను చప్పట్లు కొడతా.. సైరన్ మోగిస్తాం
రేపటి జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆయన శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్‌ని ఐక్యతతో ఎదుర్కొంటామని ప్రపంచానికి చాటడానికి, కష్ట సమయంలో ధైర్యంగా మన కోసం సేవలు అందిస్తున్న వైద్య, పోలీస్.. ఇతర సిబ్బందికి సంఘీభావం తెలిపేందుకు రేపు ఐదు గంటలు చప్పట్లు కొట్టాలని మోడీ పిలుపునిచ్చారని అన్నారు. తాను కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొడతానని చెప్పారు కేసీఆర్. రాష్ట్రమంతా కూడా సంఘీభావం తెలపాలని సూచించారు. ఐదు గంటలకు ప్రజలకు వినిపించేలా ఎక్కడికక్కడ సైరన్ మోగించేలా ఏర్పాటు చేస్తామన్నారు.
‘దేశమంతా ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని చెప్పారు. మన రాష్ట్రంలో 24 గంటలు పాటిద్దాం. ఆదివారంం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దు’ అని కోరారు సీఎం కేసీఆర్.