జపాన్‌‌‌‌‌‌‌‌ చూపు యువ భారత్ వైపు.!

జపాన్‌‌‌‌‌‌‌‌ చూపు యువ భారత్ వైపు.!

మన దేశ జనాభా 143 కోట్లుగా నమోదు అయ్యింది. ‘యువ’ భారతంలో 66 శాతం అనగా 80.8 కోట్లు 35 ఏండ్లలోపువారు ఉన్నారు.  18 నుంచి- 35 మధ్య  వయస్సు ఉన్న యువత 60 కోట్లు, 25 ఏండ్లలోపు యువత/పిల్లలు 50 శాతానికి పైగా ఉన్నారు. 15–- 29 వయస్సు కలిగిన జనాభాను యువత అని పిలవడం ఆనవాయితీగా వస్తున్నది. ప్రపంచ మానవాళిలో యువత సగటు వయస్సు 31.0 ఏండ్లు ఉండగా, భారత జనాభా సగటు వయస్సు 29.5 ఏండ్లు ఉండడంతో మన దేశాన్ని ‘యువభారతం’ అని పిలుస్తున్నది ప్రపంచం. ఈనేపథ్యంలో ప్రపంచ దేశాల్లో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌‌‌‌‌‌‌‌ నిలుస్తున్న విషయం మన దేశాభివృద్ధికి ప్రధాన బలం కావాలి. 2024 అంచనాల  ప్రకారం మొనాకో  దేశ జనాభా సగటు వయస్సు 56.2 ఏండ్లు.  జపాన్‌‌‌‌‌‌‌‌ 49.5,  ఇటలీ 48.1, జర్మనీ 46.7, ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ 42.4, యూకే 40.6, అమెరికా 38.8 నమోదు కాగా అతి తక్కువ సగటు వయస్సు ఉన్న దేశాలుగా‌‌‌‌‌‌‌‌ 15.1తో  నైగర్‌‌‌‌‌‌‌‌, 15.5తో ఉగాండా ఉన్నాయి. 

భారత్‌‌‌‌‌‌‌‌లో ఉపాధి సంక్షోభం

యువత అధికంగా ఉన్న యువ భారతాన్ని ఉద్యోగ, ఉపాధి సంక్షోభం వెంటాడుతున్నది. ఇటీవల విడుదలైన ‘భారత ఉద్యోగ/ఉపాధి నివేదిక - 2024 (ఇండియా ఎంప్లాయ్​మెంట్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ - 2024) పలు నిరుద్యోగ అంశాలను వెల్లడించింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌‌‌‌‌‌‌‌ఓ),  మానవ అభివృద్ధి విభాగం (ఐహెచ్‌‌‌‌‌‌‌‌డీ) సంయుక్తంగా విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం యువ జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ విద్యార్హతలకు తగిన అత్యాధునిక నైపుణ్యాలు కొరవడడంతో ఉద్యోగ, ఉపాధులకు దూరం అవుతున్నట్లు తెలిపింది. సెకండరీ/ఉన్నత విద్యార్హతల నిరుద్యోగ యువత 2000లో  35.2 శాతం ఉండగా 2022లో 65.7 శాతం వరకు పెరిగింది. గత రెండు దశాబ్దాల్లో సెకండరీ/ఉన్నత విద్యార్హతలు కలిగిన యువత నిరుద్యోగ రేటు 6 రెట్లు, డిగ్రీ ఆ పైన విద్యార్హతలు కలిగిన యువత నిరుద్యోగ రేటు 9 రెట్లు పెరగడం గమనించారు. 

జపాన్‌‌‌‌‌‌‌‌లో వృద్ధుల‌‌‌‌‌‌‌‌ జనాభా అధికం

అభివృద్ధి చెందిన జపాన్  ప్రస్తుత‌‌‌‌‌‌‌‌  జనాభా 12.3 కోట్లు ఉన్నది.  జపాన్  ప్రజల సగటు వయస్సు 46.7 ఏండ్లుగా నమోదు కావడంతో అక్కడ యువత జనాభా చాలా తక్కువగా ఉన్నట్లు అర్థం అవుతున్నది.  ప్రతి 10 మంది జపనీయుల్లో ఒకరు 80 ఏండ్లు దాటినవారే ఉన్నారు.  ‌‌‌‌‌‌‌‌జపాన్‌‌‌‌‌‌‌‌లో 15 ఏండ్లలోపు వారు 11.98 శాతం, 15–64 ఏండ్ల  జనాభా 59.32 శాతం ఉన్నారు.  జపాన్‌‌‌‌‌‌‌‌  జనాభాలో 65 ఏండ్లు దాటిన వృద్ధుల జనాభా  దాదాపు  మూడవ వంతు 3.6 కోట్లు (28.70 శాతం) ఉన్నది.  జపాన్‌‌‌‌‌‌‌‌లో  వృద్ధ జనాభా పెరగడంతోపాటు ఆ దేశపు జనాభా వేగంగా తగ్గడం ప్రమాద  హెచ్చరికగా పేర్కొంటున్నారు. జపాన్‌‌‌‌‌‌‌‌ జననాల రేటు తీవ్రంగా తగ్గడం, మరణాల రేటు రెట్టింపు కావడంతో జపాన్‌‌‌‌‌‌‌‌ అదృశ్యం అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదని ఆ దేశ ప్రధాని సైతం పేర్కొనడం పరిస్థితి గంభీరతను వెల్లడిస్తున్నది. 2022లో  జపాన్‌‌‌‌‌‌‌‌లో జననాలు 8 లక్షలు ఉండగా,  మరణాలు 15.8 లక్షలు నమోదు కావడం గమనించారు. 

నైపుణ్య యువతకు గిరాకీ 

జపాన్‌‌‌‌‌‌‌‌లో యువ జనాభా తగ్గడం,  వృద్ధుల జనాభా పెరగడంతో  వివిధ ఉద్యోగ ఉపాధుల నిమిత్తం అవసరమయ్యే నైపుణ్య యువత కోసం భారత్‌‌‌‌‌‌‌‌ వైపు చూడడం క్రమంగా పెరుగుతోంది. యువ జనాభా అధికంగా ఉన్న భారత్‌‌‌‌‌‌‌‌కు చెందిన నైపుణ్య యువతకు జపాన్, యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటి పాశ్చాత్య దేశాల్లో గిరాకీ పెరుగుతున్నది. గత మూడు దశాబ్దాల్లో  జపాన్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగ/శ్రామిక వర్గ జనాభా 15 శాతం కుంచించుకు పోవడంతో నేడు భారత్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఇంజినీర్లు, డాక్టర్లు, టెక్నోక్రాట్లకు గిరాకీ పెరుగుతున్నది. జపాన్‌‌‌‌‌‌‌‌ సుజుకీ ఫ్యాక్టరీలో 400 మందికి పైగా భారత ఇంజినీర్లు పని చేస్తున్నారు. వీరితో పాటు జపాన్‌‌‌‌‌‌‌‌లో  వైద్యులు,  డ్రైవర్స్‌‌‌‌‌‌‌‌,  గృహ నిర్మాణ వర్కర్స్‌‌‌‌‌‌‌‌  కొరత తీవ్రంగా ఉన్నది.  జపాన్‌‌‌‌‌‌‌‌లో  పనిచేసే వయస్సు కలిగిన జనాభా తగ్గడంతో రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌ వయస్సుతో పాటు ఓవర్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ సౌకర్యం కూడా పెంచడం జరుగుతున్నది. జపాన్‌‌‌‌‌‌‌‌లో డ్రైవర్ల సగటు వయస్సు 59 ఏండ్లు, నిర్మాణ రంగంలో 25 శాతం జపనీయుల వయస్సు 60 దాటడం, వ్యాపార వర్గాలు 70 ఏండ్లు దాటిన వృద్ధులు కూడా పని చేయడం గమనిస్తున్నాం. కొన్ని నిర్ధారిత  నైపుణ్యాలు కలిగిన ఇతర దేశాలకు చెందిన వ్యక్తులకు 5 ఏండ్ల పాటు జపాన్‌‌‌‌‌‌‌‌లో  పని చేయడానికి అవకాశం కలిపించారు.  ఉన్నత విద్య, అత్యున్నత  నైపుణ్యాలు కలిగిన విదేశీ యువతకు శాశ్వత నివాసం కూడా కల్పిస్తున్నారు. పర్యాటక, ఉపాధ్యాయ, అధ్యాపక రంగాల్లో కూడా భారతీయులకు జపాన్‌‌‌‌‌‌‌‌లో  ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. జపాన్‌‌‌‌‌‌‌‌, యూఎస్‌‌‌‌‌‌‌‌, ఆస్ట్రేలియా లాంటి పలు దేశాల్లో ఉద్యోగ ఉపాధి పొందడానికి భారత్‌‌‌‌‌‌‌‌కు చెందిన యువత సరైన విద్యార్హతలు,  సాంకేతిక నైపుణ్యత, వ్యక్తిగత  నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. 

యువ భారతం సమగ్రాభివృద్ధికి బాటలు

విద్యకు సరైన నైపుణ్యం తోడైతేనే యువభారతం సమగ్రాభివృద్ధికి  బాటలు పడతాయని గమనించాలి.  ప్రస్తుతం అత్యధికంగా వ్యవసాయ రంగంలో శ్రమిస్తున్న యువత ఆధునిక మార్పులకు అనుగుణంగా  పట్టణ నిర్మాణ, సేవారంగాల వైపు చూస్తూ  ఉపాధికి  తగిన  నైపుణ్యాలు కొరవడి సతమతం అవుతున్నారని తేలింది.  జాతీయ, రాష్ట్ర,  జిల్లా స్థాయిల్లో  స్కిల్‌‌‌‌‌‌‌‌  డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్స్‌‌‌‌‌‌‌‌ను సత్వరమే ఏర్పాటు చేసి ప్రణాళికల ప్రకారం డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉన్న ఆధునిక కోర్సుల్లో  నైపుణ్య శిక్షణను అందించాలి.  కోర్సులు/పాఠ్యాంశాలను పరిశ్రమల  అవసరానికి  తగినట్లుగా మార్చడం, అప్రెంటెస్​షిప్‌‌‌‌‌‌‌‌, మెంటరింగ్‌‌‌‌‌‌‌‌, వృత్తి విద్య కేంద్రాలను పరిశ్రమలతో అనుసంధానం చేయడం,   ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ నైపుణ్య కేంద్రాలకు రాయితీలు ఇవ్వడం, పన్నులు తగ్గించడం లాంటి చర్యల ద్వారా నిరుద్యోగ సమస్య కొంత వరకు తగ్గుతుంది. 

నైపుణ్య నిధిగా భారత్​

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌‌‌‌‌‌‌‌ -ది -జాబ్‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్,  పబ్లిక్‌‌‌‌‌‌‌‌,  ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ పార్టనర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (పీపీపీ) విభాగాలు ఏర్పాటు చేయడం, యాజమాన్యం తమ ఉద్యోగులకు నిరంతర ‘స్కిల్లింగ్‌‌‌‌‌‌‌‌’, ‘అప్‌‌‌‌‌‌‌‌ స్కిల్లింగ్’ శిక్షణలు ఇవ్వడం‌‌‌‌‌‌‌‌ సముచితంగా ఉంటుందని గమనించాలి.  అధికారిక వృత్తి విద్య,  నైపుణ్య శిక్షణ  పొందిన భారత యువతను కనీసం 15 శాతం వరకు పెంచాల్సిన అవసరం ఏర్పడిందని  నివేదిక తెలిపింది.  ప్రభుత్వాలు, వృత్తి శిక్షణ  కేంద్రాలు,  యూనివర్సిటీలు,  పరిశ్ర మలు, సేవా రంగాలు  పూనుకొని ఆధునిక  నైపుణ్యాలను అందించాలి.  యువతను అప్‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌ చేస్తూ  విదేశాల్లో అవకాశాలను చేజిక్కించు కునేలా,  నిరుద్యోగ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవాలి. దేశ సుస్థిరాభివృద్ధికి పటిష్ట  పునాదులు వేయాలని సూచనలు చేయడం సముచితం.  భారత యువతను నైపుణ్య నిధిగా మార్చడమే  మన ముందున్న తక్షణ కర్తవ్యం.  యువభారతం ప్రపంచ ఉన్నత కేంద్రంగా మారాలని, రానున్న శతాబ్దం భారతదేశానిదే అని,  ప్రపంచ దేశాలకు నైపుణ్య యువశక్తిని అందించే కేంద్రంగా భారతదేశం మారాలని కోరుకుందాం. 

- డా  బుర్ర మధుసూదన్ రెడ్డి