ఊరంతా కొట్టుకుపోయినా పరిహారం ఇయ్యలే.. 500 కోట్ల వరకు నష్టం

ఊరంతా కొట్టుకుపోయినా పరిహారం ఇయ్యలే.. 500 కోట్ల వరకు నష్టం
  • కేసీఆర్​కు ​ఇప్పుడు రైతులు గుర్తొచ్చారా అంటున్న బాధితులు
  • వేల ఎకరాల్లో వరద పాలైన పంటలు.. పొలాల్లో ఇసుకమేటలు

 జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: గతేడాది జూలైలో భారీ వరదలు భూపాలపల్లి, ములుగు జిల్లాలను అతలాకుతలం చేశాయి. మోరంచపల్లి గ్రామం పూర్తిగా కొట్టుకుపోయింది. రెండు జిల్లాల్లో కలిపి 22 మంది వరదల్లో కొట్టుకుపోయి చనిపోయారు. అయినా అప్పటి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కారు పట్టించుకోలేదు. మోరంచపల్లి బాధితుల కన్నీళ్లకు కరగలేదు. వేల ఎకరాల్లో పంటలు నష్టపోయినా పైసా పరిహారం ఇవ్వలేదు. అప్పుడు తమ నష్టాన్ని.. కష్టాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు రైతుల మీద మొసలి కన్నీరు కారుస్తున్న కేసీఆర్​ తీరుపై మోరంచపల్లి బాధితులు మండిపడుతున్నారు. 

సర్వస్వం కోల్పోయారు

జూలై 27న రాత్రి మోరంచవాగులో వరద వచ్చి ఊరిని ముంచేసింది. వరదల్లో నలుగురు కొట్టుకుపోయారు. కొట్టుకుపోయిన నలుగురిలో ముగ్గురి శవాలు దొరకగా.. ఒకరి ఆచూకీ దొరకలేదు. ఊరంతా జలదిగ్భంధం కాగా జనాలు ఇండ్ల పైకప్పుల మీదకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. వరదల్లో సర్వస్వం కొట్టుకుపోగా రైతులు, కూలీలు రోడ్డున పడ్డారు. వరద పోటెత్తి 26 ఇండ్లు పూర్తిగా ధ్వంసం కాగా 74 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 147 పాడి గేదెలు, 4 ఎడ్లు, 15 ఆవులు, 9 దూడలు, 739 కోళ్లు కొట్టుకుపోయాయి. ఒక ఫిష్‌‌‌‌ ఫ్యాక్టరీ, 8 బైకులు, 2 కార్లు, ట్రాలీ ఆటో, ట్రాక్టర్‌‌‌‌ కూడా వరదల పాలయ్యాయి. 950 ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. పొలాల్లో ఇసుక మేటలు వేసి సాగుకు అక్కరకు రాకుండా పోయాయి. పాడిగేదెలు కొట్టుకుపోయి పాల వ్యాపారం దెబ్బతిన్నది. మొత్తానికి ఒక్కో కుటుంబం రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నష్టపోయింది. 

41 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు 

జూలైలో కురిసిన భారీ వర్షాలవల్ల భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అపారనష్టం కలిగింది. రెండు జిల్లాల్లో 172 చెరువులు తెగి.. 41,602 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కువ సంఖ్యలో చెరువులు తెగడంతో మోరంచవాగు, జంపన్నవాగుల్లో వరద ఉధృతి పెరిగి మోరంచపల్లి, కొండాయి గ్రామాలు నీట మునిగాయి. చెరువులు తెగడం, వాగులు పొంగడం వల్ల వేలాది ఎకరాల్లో ఒండ్రుమట్టి చేరింది. ఇసుక మేటలు వేసి.. పొలాలు ఎడారిని తలపించాయి. దీంతో యాసంగిలో వరినాట్లు వేసుకునే పరిస్థితి లేక 50 వేల ఎకరాలు పడావు పడ్డాయి. కట్టుబట్టలతో మిగిలిన మోరంచపల్లి బాధితులను అప్పటి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కారు పలకరించిన పాపాన పోలేదు. ఇండ్లు కూలిపోయినవారికి డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌ రూం ఇండ్లు ఇవ్వలేదు. కొట్టుకుపోయిన పాడిగేదెలకు బదులు కొత్తవి కొనివ్వలేదు. ఇసుకమేటలు తొలగించడానికి పైసా సాయం చేయలేదు. 

500 కోట్ల వరకు నష్టం

 భూపాలపల్లి జిల్లాలో మోరంచవాగు, చలివాగు, మానేరు ప్రభావంతో రేగొండ, గణపురం, మొగుళ్లపల్లి, చిట్యాల, టేకుమట్ల, మల్హర్‌‌‌‌ మండలాల్లో సుమారు 8 వేల ఎకరాల్లో, ములుగు జిల్లాలో జంపన్నవాగు, దయ్యాల వాగు తదితర వాగుల ప్రవాహం వల్ల గోవిందరావుపేట, వెంకటాపూర్‌‌‌‌, ములుగు, తాడ్వాయి మండలాల్లో 5 వేల ఎకరాలలో ఇసుక దిబ్బలు కన్పిస్తున్నాయి. వేలాది సంఖ్యలో బోర్లు పూడుకపోయాయి. మోటార్లు వరదలకు కొట్టుకుపోయాయి. ఒక ఎకరం భూమిలో ఇసుక మేట తొలగించడానికి రూ.20 వేలకు వరకు ఖర్చు అయ్యింది. పంట నష్టం, ఇసుకమేటల తొలగింపు, కొత్త బోర్ల తవ్వకం తదితర ఖర్చులు కలిపితే రెండు జిల్లాల్లో రైతులు సుమారు 500 కోట్లకు పైగా నష్టం పోయినట్టు అంచనా. 

ఆపద్బంధు పైసలు ఇయ్యలే

జూలై 26,27 తేదీల్లో వచ్చిన వరదల వల్ల రాష్ట్రంలో 40 మంది చనిపోయినట్టు స్వయంగా అప్పటి ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 22 మంది చనిపోగా వీరిలో ముగ్గురి శవాలు దొరకలేదు. మోరంచపల్లెకు చెందిన మహాలక్ష్మి, ములుగు జిల్లా వెంకటాపూర్‌‌‌‌ మండలం బూరుగుపేటకు చెందిన సారమ్మ, సమ్మక్క శవాలు దొరకకపోవడంతో వారి కుటుంబాలకు ఆపద్భంధు స్కీం కింద పరిహారం కూడా ఇవ్వలేదు. వారికి డెత్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌ ఇవ్వకపోడంతో సొంతంగా చేసుకున్న ఇన్సూరెన్స్‌‌‌‌ క్లెయిమ్​లు కూడా రాలేదు. 

నా భార్య డెత్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌ ఇయ్యలే 

గత ఏడాది జూన్ 27న రాత్రి నా భార్య మహాలక్ష్మి కొట్టుకపోయి చనిపోయింది. ఇప్పటి వరకు శవం దొరకలే. చనిపోయి ఉంటుందని పోలీసులు ఎఫ్ ఐ ఆర్ కాపీ ఇచ్చినా ఆఫీసర్లు డెత్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. దీంతో ఎల్ఐసీ డబ్బులు రాలేదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతు బీమా, ఆపద్బంధు స్కీం పరిహారం కూడా అందలేదు. అప్పుడున్న సర్కారు ఇంటి ఖర్చుల కోసం రూ. 10 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం చేయలేదు. 
‒ గడ్డం శ్రీనివాస్, మోరంచపల్లి

కాంగ్రెస్​ లీడరని మానాన్న చనిపోయినా పైసలియ్యలె

గత ఏడాది వరదల్లో మా అమ్మ, నాన్న చనిపోయారు. ఉన్న ఎకరం భూమి వరదలకు కొట్టుకుపోయి కాల్వలు పడ్డాయి. పంట సాగు చేయలేని పరిస్థితి. అప్పటి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కారు మా నాన్న కాంగ్రెస్‌‌‌‌ లీడర్‌‌‌‌ అని పరిహారం ఇయ్యలే. కేవలం మా అమ్మకు సంబంధించిన చెక్కు మాత్రమే ఇచ్చారు. పొలం లెవలింగ్ కోసం సాయం చేయకపోవడంతో ఎకరం భూమి పడావు పెట్టిన. 

‒ మహమ్మద్ రఫీక్, కొండాయి, ఏటూరునాగారం మండలం, ములుగు జిల్లా