- నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఇప్పటివరకు 2,64,929 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
- యాదాద్రిలో 1.14 లక్షల టన్నుల కొనుగోలు
- మూడురోజుల్లోనే అకౌంట్లో వడ్ల డబ్బులు జమ
- నల్గొండ, సూర్యాపేట జిల్లాలో రూ.619 కోట్లకు గాను రూ.413.09 కోట్ల చెల్లింపులు
- యాదాద్రి జిల్లాలో రైతుల అకౌంట్లలోకి రూ. 210 కోట్లు
నల్గొండ, యాదాద్రి/ వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో వడ్ల కొనుగోళ్లు జోరందుకున్నాయి. మొంథా తుఫానుతో పొలాల్లో నీరు చేరి వరి కోతలు ఆలస్యమయ్యాయి. పొలాల్లో బురద ఇప్పటికీ ఎండకపోయినా రైతులు ట్రక్ హార్వెస్టర్ల ద్వారా పొలాలు కోస్తున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఎక్కువగా వస్తున్నది. ఈ క్రమంలో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
నల్గొండ, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 656 కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొంటున్నారు. ఇప్పటి వరకు రెండు జిల్లాలోని కొనుగోలు కేంద్రాలలో 2,64,929 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన రైతుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేశారు. నిబంధనల ప్రకారం తేమ శాతం ఉంటే, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ వెంటనే కొనుగోళ్లు చేస్తున్నారు.
నల్గొండ జిల్లాలో
నల్లగొండ జిల్లాలో 6,30,921 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇందుకోసం జిల్లాలో 274 దొడ్డు ధాన్యం, 98 సన్నధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రపోజ్ చేయగా జిల్లాలో 328 కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి ఇప్పటి వరకు 2,09,090 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 8132 మెట్రిక్ టన్నుల సన్న వడ్లను, 2,00,958 మెట్రిక్ టన్నుల దొడ్డు వడ్లను కొనుగోలు చేశారు. 22,544 మంది రైతుల ఖాతాల్లో రూ.343.09 కోట్లు జమ చేశారు.
సూర్యాపేట జిల్లాలో
సూర్యాపేట జిల్లాలో 4.82 లక్షల ఎకరాలలో వరి సాగు చేయగా వీటిలో 10.32లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేయగా 4.30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేయాలని ఆఫీసర్లు టార్గెట్ గా పెట్టుకున్నారు. 2,36,289 మెట్రిక్ టన్నుల సన్న రకం, 1,94,591 మెట్రిక్ టన్నులు ధాన్యం మార్కెట్ వస్తుందని అంచనా వేశారు. వీటి కోసం 328 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఇప్పటి వరకు జిల్లాలో 8,900మంది రైతుల నుండి 55,839 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా వీటిలో 53, 800 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు షిఫ్ట్ చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబందించి రూ.120 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేయగా వీటిలో దాదాపు రూ. 70 కోట్ల వరకు పేమెంట్స్ రైతుల ఖాతాల్లో జమ చేశారు.
యాదాద్రి జిల్లాలో రూ. 210 కోట్ల డబ్బు రైతుల ఖాతాల్లో జమ
యాదాద్రిలోని 17 మండలాల్లో ఈ వానాకాలం సీజన్ చివరిలో వరి సాగు పెరిగింది. జిల్లాలోని 1.71 లక్షల మంది రైతులు 2.99 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. దీంతో ఈ సీజన్లో దాదాపు 7 లక్షల టన్నుల వడ్ల దిగుబడి వస్తుందన్న అంచనా వేయగా రైతుల అవసరాలు, ప్రైవేట్ కొనుగోలు చేయగా 3 లక్షల టన్నులు సెంటర్లకు వస్తాయని అంచనా వేశారు. దీంతో 330 కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేశారు.
వానలు తగ్గడంతో కొనుగోలు ప్రక్రియ ఊపందుకుంది. రంగుమారిన వడ్ల విషయంలో కొందరు మిల్లర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. సివిల్ సప్లయ్ ఆఫీసర్లు వారికి నచ్చజెప్పి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పరిణమాలతో కొనుగోలులో స్పీడ్ పెరిగింది. బుధవారం నాటికి రైతుల నుంచి 1.40 లక్షల టన్నుల వడ్లను సివిల్ సప్లయ్ కొనుగోలు చేసింది. ఇందులో ఏ గ్రేడ్ వడ్లు 65 వేల టన్నులు, కామన్ వడ్లు 75 వేల టన్నులను కొనుగోలు చేశారు.
మిల్లులకు 1.30 లక్షల టన్నుల వడ్లను లారీల ద్వారా తరలించారు. దీంతో కొనుగోలు చేసిన 1.40 లక్షల టన్నుల్లో ఇప్పటి వరకూ లక్ష టన్నులకు సంబంధించిన పేమెంట్ రూ. 210 కోట్లు రై తుల అకౌంట్లలో జమ అయింది. మరో 40 వేల టన్నులకు సంబంధించిన అమౌంట్ రూ. వంద కోట్లకు పైబడి రైతుల అకౌంట్లలో వేయాల్సి ఉంది. గోడౌన్ల విషయంలో మార్కెటింగ్ శాఖ కొర్రీలు పెడుతోంది.
వడ్ల నిల్వ కోసం జిల్లాలో పలు చోట్ల వ్యవసాయ మార్కెట్లకు చెందిన గోడౌన్లను వాడుకోవాల్సి వస్తోంది. అయితే గోడౌన్లకు సంబంధించిన రెంట్ బకాయిలు ఉన్నాయంటూ తాళాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. పైస్థాయి ఆఫీసర్లతో జిల్లా ఆఫీసర్లతో మాట్లాడించినా ఆటంకాలు కల్గిస్తున్నారు.
నిరంతరం అధికారుల పర్యవేక్షణ
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. నల్గొండ జిల్లాలో మొత్తం 152 మిల్లులలో ఇప్పటివరకు 66 మిల్లులకు ట్యాగింగ్ చేయగా సూర్యాపేట జిల్లాలో దాదాపు 40 కి పైగా మిల్లులను ట్యాగింగ్ చేసి ఎప్పటికప్పుడు ధాన్యాన్ని కాంటాలు వేస్తూ, లారీల ద్వారా గోడౌన్లు, మిల్లులకు తరలిస్తున్నారు.
మరోపక్క జిల్లా కలెక్టర్లు ప్రతి రోజు సెంటర్లను పరిశీలిస్తూ ఎక్కడ కూడా జాప్యం చేయకుండా రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ చేస్తూ 72 గంటల్లోనే రైతుల అకౌంట్ లోకి డబ్బులు జమ అయ్యేలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు.
దీంతో తుపాను ప్రభావంతో అకాల వర్షాలు పడుతుండడం, తేమ వాతావరణం కారణంగా ధాన్యం ఎండే పరిస్థితి లేకపోవడంతో పచ్చి వడ్లనే ప్రైవేట్ కు అమ్ముకున్నారు. క్వింటా రూ.2000 నుంచి రూ.2200 వరకు ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేశారు. దీంతో అప్పుడు పచ్చి వడ్లను అమ్ముకున్న రైతులు ఇప్పుడు బాధపడుతున్నారు
