
టీమిండియా హెడ్ కోచ్ పదవికి.. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనెదరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. ఇతనితో పాటు మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్, టామ్ మూడీ, వీరేంద్ర సెహ్వాగ్ కూడా రేసులో ఉన్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. అంతర్జాతీయ క్రికెట్‌లో విశేష అనుభవం ఉన్న జయవర్దనె.. 2015లో కోచింగ్ కెరీర్ మొదలుపెట్టాడు. అప్పట్లో ఇంగ్లండ్ టీమ్‌కు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా సేవలందించాడు. తర్వాత 2016లో ముంబై ఇండియన్స్‌కు హెడ్ కోచ్‌గా వచ్చాడు.
ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ స్థానంలో వచ్చిన మహేల.. ముంబై ఇండియన్స్‌ను మూడేళ్లలో రెండుసార్లు (2017, 2019) విజేతగా నిలిపాడు. ప్రపంచకప్‌లో పరుగుల వరద పారించిన రోహిత్ కూడా జయవర్దనె కోచింగ్ నైపుణ్యాన్ని బాగా నమ్ముతాడు. మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్‌కు మధ్య విభేదాలు తలెత్తాయన్న వార్తల నేపథ్యంలో మహేల దరఖాస్తు వెనుక హిట్‌మ్యాన్ హస్తం ఉండొచ్చని కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ మహేల కోచ్‌గా పగ్గాలు చేపడితే టీమిండియాలో రోహిత్ ప్రాబల్యం బాగా పెరిగిపోతుందనేది వాస్తవం. కర్ణాటక మాజీ ప్లేయర్ జే. అరుణ్ కుమార్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌కు దరఖాస్తు చేసుకున్నాడు.