
- ఈ నెల 30 చివరి తేదీ..
- అయినా వాహనదారులు, ఆర్టీఏ అధికారుల నుంచి స్పందన నిల్
హైదరాబాద్, వెలుగు: 2019 ఏప్రిల్ 1 ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న అన్ని రకాల వాహనాలకు ఈ నెల 30లోపు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (హెచ్ఎస్ఆర్పీ) అమర్చుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయితే, గడువు సమీపిస్తున్నప్పటికీ వాహనదారులు, ఆర్టీవో అధికారులు దీనిపై ఎలాంటి ఆసక్తి కనబర్చడంలేదు. హెచ్ఎస్ఆర్పీ ప్లేట్లు వాహనాల భద్రతను మెరుగుపరుస్తాయి. ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా చూస్తాయి.
దొంగతనాలు జరిగినా వెంటనే ట్రాకింగ్ సులభం చేస్తాయి. ఇందులో హోలోగ్రామ్‌లు, లేజర్ కోడ్‌లు వంటి అధునాతన సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. అందుకే 2019 ఏప్రిల్ 1 ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలకు ఈ నెల 30లోపు విధిగా ఈ ప్లేట్లు అమర్చుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 50 నుంచి 60 లక్షల వరకు వాహనాలకు ఇవి అవసరమైనప్పటికీ, చాలా తక్కువ మంది అమర్చుకున్నారు.