
- బీఆర్ఎస్ సోషల్ మీడియా నన్ను టార్గెట్ చేస్తున్నది: కవిత
హైదరాబాద్, వెలుగు: రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ‘‘పార్టీ ఏర్పాటుపై ఇప్పటికైతే ఎలాంటి ఆలోచన లేదు. టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో కేసీఆర్ వందలాది మందితో చర్చించారు. ఇప్పుడు నేనూ అదే చేస్తున్నా.. భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు’’అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఎవరూ స్పేస్ ఇవ్వరని, తొక్కుకుంటూ వెళ్లాల్సిందేనని అన్నారు.
తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతురు తానే కావొచ్చని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లోకి వెళ్లాలనే ఆలోచన లేదన్నారు. సీఎం రేవంత్ పదేపదే తన పేరు ఎందుకు తీస్తున్నారో తెలియదని, ముఖ్యమంత్రే కాంగ్రెస్ నుంచి బయటకు పోతున్నారేమోనని అన్నారు. శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని జాగృతి ఆఫీసులో కవిత మీడియాతో చిట్‌చాట్ చేశారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా తనపై దాడి చేస్తున్నదని ఆమె తెలిపారు. ‘‘బీఆర్ఎస్ సోషల్ మీడియా, హరీష్ రావు సోషల్ మీడియా, సంతోష్ రావు సీక్రెట్ మీడియా నా మీద దాడి చేస్తున్నాయి. పార్టీలో నాకు జరిగిన ఇబ్బందులపై సీఎం ఏమన్నారో నాకు తెలియదు. కానీ బీఆర్ఎస్‌లో అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారని జనం అనుకుంటున్నారు’’అని పేర్కొన్నారు.