కేసీఆర్తో గ్యాప్ .. కుమారస్వామి క్లారిటీ

కేసీఆర్తో గ్యాప్ .. కుమారస్వామి క్లారిటీ

సీఎం కేసీఆర్ తో తనకు గ్యాప్ వచ్చిందన్న వార్తలపై జేడీఎస్ అధినేత కుమార స్వామి క్వారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో తన తండ్రి దేవేగౌడ్ తర్వాత అంతటి మార్గదర్శి కేసీఆరేనని వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని  రాయిచూర్ లో జరిగిన పంచరత్న యాత్రలో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కర్ణాటక అభివృద్ధిని వెనక్కి నెట్టాయని విమర్శించారు.  సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 24 జిల్లాల రైతులకు మేలు జరుగుతోందని చెప్పారు. మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరందుతుందని కితాబిచ్చారు. కర్ణాటకలో జేడీఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. పాలనలోనూ కేసీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుంటామని తెలిపారు. 

జనవరి 18న ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంతమాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. అయితే కుమారస్వామి అటెండ్ కాకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ తో కుమారస్వామికి గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరిగింది.