కొడుకు కోసం తల్లి త్యాగం.. కంచుకోటను కాపాడుకోలేకపోయిన జేడీఎస్

కొడుకు కోసం తల్లి  త్యాగం.. కంచుకోటను కాపాడుకోలేకపోయిన జేడీఎస్

కర్ణాటక ఎన్నికల్లో తల్లి చేసిన త్యాగం ఫలించలేదు. కొడుకు కోసం గెలిచే సీటును అప్పగిస్తే..అది కాస్తా..అప్పనంగా కాంగ్రెస్ కు అప్పగించాడు. సినిమాల్లో సక్సెస్ కాకపోవడంతో...కనీసం రాజకీయంగా వారసుడు అవుతాడనుకున్న కుమారస్వామి పుత్ర రత్నం..దేవెగౌడ మనవడు నిఖిల్ కుమారస్వామి పట్టున్న సీటులో పట్టు నిలుపుకోలేకపోయారు. 
 
కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ రాజకీయ వారసుడు బొక్క బోర్లా పడ్డాడు. రామనగర నుంచి పోటీ చేసిన నిఖిల్ కుమారస్వామి ఓడిపోయారు. అయితే ఈ స్థానంలో కుమారస్వామి భార్య అనితా కుమారస్వామి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018లో  కుమారస్వామి చన్నపట్న, రామనగర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండింటిలోనూ విజయం సాధించారు. ఆ తర్వాత రామనగర ఎమ్మెల్యే పదవికి కుమారస్వామి రాజీనామా చేయడంతో అనితా కుమారస్వామి ఉప ఎన్నికలో జేడీఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో కొడుకు నిఖిల్ కోసం అనితా కుమారస్వామి తన సీటును త్యాగం చేసింది. కానీ నిఖిల్‌ మాత్రం రామనగర నుంచి గెలవలేకపోయాడు. కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్ 13,459 ఓట్లతో విజయం సాధించాడు.

రామ‌న‌గ‌ర అసెంబ్లీ స్థానంలో జేడీఎస్‌కి మంచి పట్టు ఉంది.. అందుకే ఈ స్థానం నుంచి  కొడుకు నిఖిల్ను హెచ్డీ కుమారస్వామి బరిలోకి దింపారు. అయితే పట్టున్న ప్రాంతంలో కూడా పట్టు నిలుపుకోలేకపోయింది జేడీఎస్. ఇక 2019లో మండ్య లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో పోటీ చేసిన నిఖిల్.. సుమలత అంబరీష్ చేతిలో ఓడిపోయారు.

హీరోగానూ ఆకట్టుకోలేదు..

ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చిన నిఖిల్ కుమారస్వామి..గతంలో పలు సినిమాల్లోనూ నటించారు. జాగ్వార్, రైడర్, సీతారామకళ్యాణ, కురుక్షేత్ర వంటి మూవీస్ చేశారు. 2016లో నిఖిల్ గౌడ నటించిన  జాగ్వార్ చిత్రం తెలుగులోనూ రిలీజైంది. ఈ  సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. రూ. 100 కోట్లతో తెరకెక్కిన జాగ్వార్ కు  రాజమౌళి తండ్రి, బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. సినిమాల్లో సక్సెస్ కాకపోవడంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ కుమారస్వామి...అక్కడ కూడా ఓటమి పాలయ్యారు.