రేపటి నుంచి JEE మెయిన్‌ తొలి విడత పరీక్షలు

రేపటి నుంచి JEE మెయిన్‌ తొలి విడత పరీక్షలు

దేశవ్యాప్తంగా JEE మెయిన్‌ మొదటి విడత ఆన్‌లైన్‌ పరీక్షలు రేపటి(మంగళవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 23 నుంచి 26 వరకు పేపర్‌-1, పేపర్‌-2 నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలుంటాయి. రోజుకు రెండు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలను ఏపీ, తెలంగాణ నుంచి మొత్తం 1,61,579 మంది రాయనున్నారు. ఏపీ నుంచి 87,797 మంది, తెలంగాణ నుంచి 73,782 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు.

11 ప్రాంతీయ భాషల్లో పరీక్ష..

తొలిసారిగా JEE  ఎగ్జామ్స్ ను 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. ఇంగ్లీష్, హిందీతో పాటు ఒక ప్రాంతీయ భాష ఉంటుంది. అందులో తెలుగు భాషలో కూడా పేపర్‌ ఉంటుంది. పేపర్‌-1లో గతంలో 75 ప్రశ్నలు ఇచ్చేవారు. ఈసారి 90 ప్రశ్నలిస్తారు. ఒక్కో సబ్జెక్టులో 30 ప్రశ్నలుంటాయి. అందులో ప్రతి సబ్జెక్టులో ఒక సెక్షన్‌లో 10 ప్రశ్నల్లో అయిదింటికి ఆన్సర్లు రాయాల్సి ఉంటుంది. కరోనా పరిస్థితుల కారణంగా ఈసారి ఛాయిస్‌ ఇస్తున్నారు. పేపర్‌-2Aలో 82, 2Bలో 105 ప్రశ్నలిస్తారు. వాటిల్లో కూడా ఛాయిస్‌ ఉంటుంది. హాల్‌టికెట్‌పై ఫ్రింట్ చేసిన కరోనా నిబంధనలు, జాగ్రత్తలు పూర్తిగా చదవాలని, అందులో ఏ వస్తువులు పరీక్షకు తప్పనిసరిగా తీసుకెళ్లాలో.. ఏవి తీసుకెళ్లరాదో ఇచ్చారు. అంతేకాదు పరీక్షా కేంద్రాన్ని ఒకరోజు ముందుగా పరిశీలించుకోవాలని  అధికారులు తెలిపారు. గతేడాది మాదిరిగానే కరోనా లేదని సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారమ్‌ సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు.

పరీక్ష కేంద్రాలు..

తెలంగాణ: హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ నగరాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌: విశాఖపట్టణం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, నరసరావుపేట, పొద్దుటూరు, సూరంపాలెంలలో సెంటర్లను ఏర్పాటు చేశారు.