జేఈఈ రిజల్ట్స్: ఇద్దరు తెలంగాణ విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు

జేఈఈ రిజల్ట్స్: ఇద్దరు తెలంగాణ విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు

ఢిల్లీ: జేఈఈ మెయిన్స్ కు సంబంధించిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజేన్సీ మంగళవారం అర్ధరాత్రి విడుదలచేసింది. ఈ ఫలితాలలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు మొదటి ర్యాంకును దక్కించుకున్నారు. రాష్ట్రానికి చెందిన కొమ్మ శరణ్య మరియు జోస్యుల వెంకట ఆదిత్య 100 శాతం మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంకును సాధించారు. వీరితో పాటు మరో 16 మంది విద్యార్థులు కూడా మొదటి ర్యాంకును సాధించారు. అంతేకాకుండా.. ఈ ఎగ్జామ్ రాసినవారిలో మొత్తం 44 మంది వంద శాతం స్కోర్ సాధించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈ పరీక్షను ఏడాదికి నాలుగుసార్లు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల ఒకసారి రాసిన పరీక్షలో మంచి మార్కులు రాకుంటే.. మరోసారి రాసి తమ ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకోవచ్చు. విద్యార్థులకు ఏ పరీక్షలో మంచి మార్కులు వస్తాయో దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం నాలుగు విడతలలో కలిపి ఈ పరీక్షకు 9.34 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలుగు, ఉర్దూతో పాటు మొత్తం 13 భాషలలో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి మరియు మార్చిలలో మొదటి, రెండవ విడతల పరీక్షను నిర్వహించారు. ఆ తర్వాత ఏప్రిల్ మరియు మే నెలల్లో మూడో, నాలుగో విడతల పరీక్షను నిర్వహించాలని అధికారులు భావించారు. కానీ, కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదావేశారు. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిన తర్వాత జూలై 20 నుంచి 25 వరకు మూడో విడత మరియు ఆగష్టు 26 నుంచి సెప్టెంబర్ 2 వరకు నాలుగో విడత పరీక్షను నిర్వహించారు.