వెలుగు ఓపెన్ పేజీ.. జగిత్యాల జీవనం దారెటు?

వెలుగు ఓపెన్ పేజీ.. జగిత్యాల జీవనం దారెటు?

రాజకీయాల్లో  పార్టీ  గుర్తింపుతో  ఎదిగే  నాయకులే ఎక్కువగా కనిపిస్తుంటారు. కానీ  మరికొందరు నాయకుల ​ క్యారెక్టరే ఆయా పార్టీలకు మరింత  వన్నె తెస్తుంది.  సింప్లి​సిటి,  ఫేర్​ పాలిటిక్స్​,  నిక్కచ్చితనం, సామాన్య జీవితం, మెరుగైన ప్రజాసంబంధాలు కలిగిన నాయకుడు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి  ప్రయోజనమే. రాజకీయాల్లో  గెలుపోటములు సహజం. ఓడిపోయిన ప్రతినాయకుడికి జనాదరణ లేదనుకుంటే పొరపాటు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో,  2024 లోక్​సభ ఎన్నికల్లో  జీవన్​ రెడ్డి  ఓడిపోవచ్చుగాక,  ప్రజల్లో  ఆయన వ్యక్తిత్వం పట్ల గౌరవం ఓడిపోలేదు. అందుకే జగిత్యాల నుంచి గెలిచిన  బీఆర్​ఎస్​  ఎమ్మెల్యే  కాంగ్రెస్​  పార్టీలో  చేరడాన్ని  అంత ధైర్యంగా,  తీవ్రంగా వ్యతిరేకించగలిగారు. ఇలాంటి రాజకీయ నాయకులు నిజంగా చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అందులో జీవన్​ రెడ్డి ఒకరని కచ్చితంగా చెప్పొచ్చు.

జగిత్యాల ఆయన రాజకీయ రణ క్షేత్రం.  1981లో  ఆయన రాజకీయ జీవితం పంచాయతీ సమితి అధ్యక్షుడిగా మొదలైంది.  తదుపరి 6 సార్లు ఎమ్మెల్యేగా,  మూడుసార్లు మంత్రిగా  పనిచేశారు. ఆయన రాజకీయ జీవితం కాంగ్రెస్​ పార్టీలోనే  దశాబ్దాల పాటు సాగింది. నిన్న ఆయన కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేయడం తెలంగాణ రాజకీయాలకు  ఒక కుదుపు లాంటిదే!   నిజానికి ఆయనకు కాంగ్రెస్​ పార్టీ అనేక అవకాశాలిచ్చిందనడంలో ఎంత నిజముందో, ఆయన ఫెయిర్​ పొలిటికల్​ కెరీర్​​ కూడా కాంగ్రెస్​ పార్టీకి అంతే ఉపయోగపడిందని చెప్పాలి.  అలాంటి  క్రెడిబుల్​ లీడర్​  జీవన్​ రెడ్డి కాంగ్రెస్​ పార్టీ కి రాజీనామా చేయడమే.. ఇపుడు ఆయనను తెలంగాణ రాజకీయాల్లో  వార్తల్లో వ్యక్తిగా నిలబెట్టింది.

కాంగ్రెస్​కు అరుదైన క్రెడిబుల్​ నాయకుడు

నిజానికి జీవన్​రెడ్డి కాంగ్రెస్​ పార్టీ కష్టాల్లో ఉన్నపుడు (2019) ఆయన గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీగా గెలిచి. అప్పటి కేసీఆర్​ ప్రభుత్వాన్ని ఖంగు తినిపించాడు. గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీగా జీవన్​ రెడ్డి గెలుపు అప్పట్లో కాంగ్రెస్​ పార్టీకి గొప్ప బూస్ట్​ ఇచ్చింది. తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్​ పార్టీ నేతల్లో జీవన్​రెడ్డి కూడా ఒకరు.  అంతేకాదు, తెలంగాణ వచ్చాక  కేసీఆర్​ ప్రభుత్వ వైఫల్యాలపై, అవినీతిపై నిక్కచ్చిగా నిలదీసిన  నాయకుడాయన.   తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​ పార్టీని అధికారంలోకి  తేవాలనే లక్ష్యం ఆయన మాట్లాడే మాటల్లో అడుగడుగునా కనపడేది.  ఆయన జగిత్యాల నాయకుడే అయినా, మోస్ట్ క్రెడిబుల్​ లీడర్​గా ఆయనకు తెలంగాణ వ్యాప్తంగా పేరుంది.  ఆయనకు ఏఐసీసీ అప్పట్లో  పీసీసీ అధ్యక్ష పదవి ఆఫర్​ కూడా ఇచ్చిందని విన్నాం. కానీ ఆయనే సున్నితంగా వద్దన్నట్లు కూడా విన్నాం.  పార్టీ  గెలుపు ముఖ్యం తప్ప పదవి ముఖ్యం కాదనే భావన ఆయన పట్ల ఇవాళ  కాంగ్రెస్​ క్యాడర్​లోనూ గౌరవాన్ని తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. 

పార్టీలో గౌరవం?

కాంగ్రెస్​ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక  ఆయనకు మంత్రి పదవి దక్కుతుందనే  వార్తలు విన్నాం. కానీ, జగిత్యాలలో ఆయన ఓడిపోవడం వల్ల ఆ అవకాశం వచ్చి ఉండకపోవచ్చు. ఓడినా, గెలిచినా, కాంగ్రెస్​ పార్టీకి కావల్సిన నేతగా ఆయనకు దక్కాల్సినంత గౌరవం లభించలేదనే అభిప్రాయం ఉండటం చిన్నపాటి కారణమే అనుకున్నా, ఆయనపై గెలిచిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కాంగ్రెస్​ పార్టీలో చేరడం జీవన్​ రెడ్డికి ఒక పొలిటికల్​ ఛాలెంజ్​గా  మారడమే ఆయన రాజీనామాకు ప్రధాన కారణమని చెప్పాలి. 

ప్రజల్లో సానుభూతి                  

జీవన్​ రెడ్డి  పొలిటికల్​ స్టేటస్​  లెక్కలోకి తీసుకొని చూస్తే మాత్రం.. జగిత్యాల బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కాంగ్రెస్​లో చేరడాన్ని  ఆయన వ్యతిరేకించడం తప్పని ఎవరూ అనుకోవడం లేదు. జీవన్​ రెడ్డి వాదనకు  ప్రజల్లోనూ సానుభూతి ఉంది.  కాబట్టే, జీవన్​ రెడ్డిని బుజ్జగించడానికి కాంగ్రెస్​ నేతలు, మంత్రులు చివరిరోజుదాకా ప్రయత్నించారు, విఫలమైనారు. ఆయన ఇపుడు ఏ పార్టీలో చేరతాడనే చర్చ అంతటా జరుగుతోంది. బీఆర్​ఎస్​లో చేరే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం విస్తృతంగా వినిపిస్తోంది. ఆయన బీజేపీలో  చేరతారనే వాదన కూడా అంతే బలంగా వినబడుతోంది. 

కుటుంబ పార్టీలో చేరితే..

ఆయన రాజీనామాకు ఎంత ప్రాధాన్యం లభించిందో, ఇపుడాయన ఏ పార్టీలో చేరతారనేది కూడా అంతే ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. జీవన్​ రెడ్డి రాజకీయ పోరాటమంతా బీఆర్​ఎస్​కు వ్యతిరేకంగానే కొనసాగింది. జీవన్​రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చుకున్న నేతగా, బీఆర్​ఎస్​ లాంటి ఒక కుటుంబ పార్టీలో ఇమడగలరా?  ఒకవేళ బీఆర్​ఎస్​లో చేరినా చేయగలిగేదేమీ లేకపోయినా.. ఆయన పొలిటికల్​ కెరీర్​కు బీఆర్​ఎస్​ ​ సూటబుల్​ పార్టీ  కాదనే అభిప్రాయం మాత్రం సర్వత్రా వినిపిస్తోంది. ఫలితంగా ఆయన బీజేపీలో చేరే అవకాశాలు అనివార్యం అవుతాయేమో చెప్పలేం!  కొంతకాలం ఆయన రాజకీయ పరిస్థితులను పరిశీలించే అవకాశమూ లేకపోలేదు.  ఏది ఏమైనా జీవన్​రెడ్డి రాజీనామా ఎటు మలుపు తిరుగుతుందనే కన్నా.. తెలంగాణ రాజకీయాలను అది కొంతైనా ప్రభావితం చేయబోతుందని మాత్రం చెప్పొచ్చు.

‌‌‌‌‌‌‌‌- కల్లూరి

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.