
బెంగళూరు: సరుకులను డెలివరీ చేయడానికి వెళ్లిన జెప్టో డెలివరీ బాయ్ చిరునామా తప్పుగా పెట్టారంటూ గొడవ పడ్డాడు. మాటామాట పెరగడంతో కస్టమర్‌పై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో కస్టమర్ తలకు బలమైన గాయాలయ్యాయి. బెంగళూరు బసవేశ్వర నగర్ జడ్జిల కాలనీలో మూడ్రోజుల కిందట జరిగిందీ ఘటన. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డెలివరీ ఏజెంట్ నుంచి సరుకులు తీసుకునేందుకు ఓ మహిళ వెళ్లింది.
అయితే, అడ్రస్ తప్పుగా పడటంపై వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. డెలివరీ ఏజెంట్ దూషించడం మొదలుపెట్టడంతో మహిళ బంధువు శశాంక్ అనే యువకుడు కల్పించుకున్నాడు. దీంతో సహనం కోల్పోయిన డెలివరీ బాయ్ విష్ణు వర్ధన్.. శశాంక్‌పై దాడి చేశాడు. పిడిగుద్దులు కురిపించడంతో శశాంక్ ముఖం, దవడ, కన్ను భాగాల్లో గాయాలయ్యాయి. తలకు ఫ్రాక్చరైంది.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన శశాంక్.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గాయాలు వారంలో మానకపోతే తలకు సర్జరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారని శశాంక్ తెలిపాడు. ఈ ఘటనపై జెప్టో కంపెనీ విచారం వ్యక్తం చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. కాగా, శశాంక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.