
ముంబై : మూతపడిన జెట్ ఎయిర్‌వేస్ కొనుగోలుకు మరో సంస్థ ఆసక్తి చూపింది. ఇది దరఖాస్తు చేయడానికి ‘ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ కు తుది గడువును శనివారం వరకు పొడిగించారు. డెడ్‌లైన్ ముగిసిన తర్వాత ఆ బిడ్డర్ తన ఆసక్తిని దాఖలు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ కంపెనీ దక్షిణ అమెరికాకు చెందిన ప్రముఖ సినర్జీ గ్రూప్ కార్ప్. దీనికి కొలంబియన్ క్యారియర్ ఏవియాంకా హోల్డింగ్స్‌లో మెజార్టీ వాటాలున్నాయి. దక్షిణ అమెరికాలోనే రెండో అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ ఇది. జెట్ ఎయిర్‌వేస్ పై ప్రస్తుతం ఈ సంస్థ ఆసక్తి చూపుతున్నట్టు మీడియా రిపోర్ట్‌లు చెబుతున్నాయి. ఆగస్ట్ 10న డెడ్‌లైన్ ముగిసిన తర్వాత సినర్జీ గ్రూప్ తన ఆసక్తిని సమర్పించినట్టు పేర్కొన్నాయి. దీంతో ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్‌ల గడువును ఈ నెల చివరి వరకు అంటే శనివారం వరకు పొడిగించారు.
లిస్ట్‌లో ఉంది కేవలం ట్రెజరీ ఆర్‌ఏ క్రియేటరే..
ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరస్ట్‌లను బిడ్స్‌గా పరిగణించలేం. కానీ మూతపడిన ఈ ఎయిర్‌లైన్ కోసం వీరు చూపిస్తున్న ఆసక్తిని పరిగణలోకి తీసుకుని, వీరిని బిడ్స్ దాఖలు చేసేందుకు ఆహ్వానిస్తారు. డెడ్‌లైన్ పొడిగించడంతో మరింత మంది ఈ ఎయిర్‌లైన్‌పై ఆసక్తి చూపించేందుకు అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ప్రస్తుతం జెట్ ఎయిర్‌వేస్ రిజల్యూషన్ ప్రక్రియలో ఉంది. రిజల్యూషన్ ప్రొఫిషినల్ చేతిలోనే జెట్ భవితవ్యం ఉంది. డెడ్‌లైన్ ముగియక ముందు బిలినియర్ అనిల్ అగర్వాల్ ఫ్యామిలీకి చెందిన వోల్కాన్ ఇన్వెస్ట్‌మెంట్స్, పనామాకు చెందిన అవంటులో గ్రూప్, రష్యన్ ఫండ్ ట్రెజరీ ఆర్‌ఏ క్రియేటర్‌ల నుంచి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్‌లు వచ్చాయి. ఆ తర్వాత వోల్కాన్ ఇన్వెస్ట్‌మెంట్ తన ఆసక్తిని వెనక్కి తీసుకుంది. అవంటులో షార్ట్‌లిస్ట్ అవలేకపోయింది. కేవలం ట్రెజరీ ఆర్‌ఏ క్రియేటర్ మాత్రమే జెట్ కోసం బిడ్స్ దాఖలు చేసే లిస్ట్‌లో ఉంది. ఇప్పటికే జెట్ నుంచి ఉద్యోగులందరూ ఇతర ఎయిర్‌లైన్ సంస్థలకి వెళ్లిపోయారు.