
- 5–10 శాతం ఎక్కువ రేటుకు అమ్ముతున్న కొంత మంది జ్యువెలర్లు
- రూ.10 గ్రాముల గోల్డ రూ.66 వేలకు
- బంగారం, వెండి కొనేందుకు జనాలు ఎగబాకడం టేదని, ఎంక్వైరీలు మాత్రమే పెరిగాయంటున్న ఇండ్రస్ట్రీ వర్గాలు
న్యూఢిల్లీ: సర్క్యులేషన్ నుంచి రూ. 2 వేల నోట్లు విత్‌డ్రా అవ్వడంతో గోల్డ్‌కు ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. గోల్డ్, సిల్వర్ కొనుగోళ్లకు సంబంధించి జ్యువెలర్లకు ఎంక్వైరీలు బాగా వస్తున్నాయి. కానీ, 2016 లోని డీమానిటైజేషన్ టైమ్‌లో జరిగినట్టు పానిక్ బయ్యింగ్ (ఒక్కసారిగా కొనుగోళ్లు జరగడం) రాలేదని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ)పేర్కొంది. నో యువర్ కస్టమర్ (కేవైసీ) రూల్స్ కఠినంగా ఉంటుండడంతో రూ. 2 వేల నోట్లతో గోల్డ్ కొనడం తక్కువగానే జరుగుతోందని వెల్లడించింది. మరోవైపు చాలా మంది జ్యువెలర్లు గోల్డ్ రేట్లను 5–10 శాతం పెంచి అమ్ముతున్నారని సంబంధిత వ్యక్తులు వెల్లడించారు. దీంతో 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 66 వేల మార్క్‌ను టచ్ చేసిందని అన్నారు. ప్రస్తుతం దేశంలో గోల్డ్ ధర సగటున రూ.60,200 దగ్గర ఉంది. రూ.63 వేల వరకు పెరిగిన తర్వాత తాజాగా కరెక్ట్ అయ్యింది. ‘రూ.2 వేల నోట్లతో గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేయడంపై చాలా ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. శనివారం స్టోర్లకు వచ్చేవారు పెరగడం చూశాం. కానీ, కేవైసీ రూల్స్ కఠినంగా ఉండడంతో వీరిలో గోల్డ్ కొనేవాళ్లు తక్కువగానే ఉన్నారు’ అని జీజేసీ చైర్మన్ సైయమ్ మెహ్రా అన్నారు. పానిక్ బయ్యింగ్ కనిపించడం లేదని వెల్లడించారు. అలానే స్టోర్లకు వచ్చే వారు సాధారణ స్థాయికి చేరుకున్నారని అన్నారు. ఎక్స్చేంజ్, డిపాజిట్ చేసుకోవడానికి ఆర్‌బీఐ నాలుగు నెలల టైమ్ ఇవ్వడంతో రూ. 2 వేల నోట్లతో గోల్డ్ కొనడానికి జనాలు ఎగబాకడం లేదని వివరించారు. కాగా, సర్క్యులేషన్‌లోని రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నామని రిజర్వ్ బ్యాంక్ ఈ నెల 19 న ప్రకటించింది. లీగల్ టెండర్‌గా కొనసాగుతుందని చెప్పినప్పటికీ, సెప్టెంబర్ 30 లోపు బ్యాంకులు, ఆర్‌బీఐ బ్రాంచుల దగ్గర డిపాజిట్, ఎక్స్చేంజ్ చేసుకోవడానికి టైమ్ ఇచ్చింది. రూ. 2 వేల నోట్లను ఇష్యూ చేయడాన్ని ఆపాలని బ్యాంకులకు ఆదేశించింది. సెప్టెంబర్ 30 తర్వాత కూడా రూ.2 వేల నోట్లు లీగల్ టెండర్‌గా కొనసాగుతాయని గుర్తు పెట్టుకోవాలి. దీంతో వీటిని సెల్లర్లు పేమెంట్ల కింద కచ్చితంగా అంగీకరించాల్సి ఉంటుంది.
అన్‌ఆర్గనైజ్డ్ సెక్టార్‌లోనే అలా..
జీఎస్‌టీ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) హాల్‌మార్క్ వంటివి అమల్లోకి వచ్చాక జ్యువెలర్లు ఆర్గనైజ్డ్‌గా మారారని మెహ్రా అన్నారు. ‘క్యాష్‌లో ట్రాన్సాక్షన్లు పూర్తి చేసుకోవడానికే పెద్ద నోట్ల అవసరం ఉంటుంది. ప్రస్తుతం దేశ జ్యువెలరీ ఇండస్ట్రీలో డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నాయి. అందువలన రూ. 2 వేల నోట్ల విత్‌డ్రా ప్రభావం గోల్డ్ అండ్ జ్యువెలరీ బిజినెస్‌పై పెద్దగా ఉండదు’ అని అభిప్రాయపడ్డారు. రూ. 2 వేల నోట్లకు బదులు ఎక్కువ ధరకు గోల్డ్‌ను అమ్మడం అన్‌ఆర్గనైజ్డ్ సెక్టార్‌లోనే జరుగుతోందని పీఎన్‌జీ జ్యువెలర్స్ చైర్మన్ సౌరభ్ గాడ్గిల్ అన్నారు. అర్గనైజ్డ్ సెక్టార్‌లోని జ్యువెలర్లు ఇలాంటి పనులకు దూరంగా ఉన్నారని చెప్పారు. డీమానిటైజేషన్ టైమ్‌లో ప్రజలు గోల్డ్ వైపు మరలడం చూస్తుంటామని కమోట్రెండ్జ్ రీసెర్చ్ ఫౌండర్ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ పేర్కొన్నారు. కానీ, ఈ సారి ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఎక్కువగా ఉన్నాయని గుర్తు చేశారు. కాగా, రూ. 2 లక్షల కంటే ఎక్కువ విలువైన గోల్డ్ లేదా ప్రీషియస్ మెటల్స్‌ను కొనే కన్జూమర్లు తమ పాన్ లేదా ఆధార్ కార్డ్ తప్పకుండా ఇవ్వాలి.
నోట్ల ఎక్స్చేంజ్‌కు ఐడీ ప్రూఫ్ అవసరం లేదు..
రూ. 2 వేల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఫామ్స్ లేదా స్లిప్‌లను నింపాల్సిన అవసరం లేదు. ఆర్‌బీఐ పెట్టిన లిమిట్ ప్రకారం, ఒక సారి రూ.20 వేల కంటే ఎక్కువ విలువైన రూ. 2 వేల నోట్లను ఎక్స్చేంజ్ చేయడానికి అవ్వదు. ఎటువంటి ఫామ్‌లు, స్లిప్‌లు తీసుకోకుండా కూడా రూ.20 వేల వరకు గల రూ.2 వేల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కస్టమర్లకు అనుమతి ఇవ్వాలని ఎస్‌బీఐ సర్క్యులర్‌లో పేర్కొంది. రూ. 2 వేల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఎటువంటి ఐడీ ప్రూఫ్‌లను కస్టమర్లు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. సొంత అకౌంట్లలో డిపాజిట్ చేసుకోవడంపై మాత్రం ఆర్‌బీఐ ఎటువంటి లిమిట్ పెట్టలేదు. కానీ, సాధారణంగా ఉండే కేవైసీ, ఇతర రూల్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి నాలుగు నెలల టైమ్ ఉన్నా, చాలా మంది కస్టమర్లు బ్రాంక్ బ్రాంచుల దగ్గర రూ. 2 వేల నోట్లతో క్యూ కట్టడం శనివారం కనిపించింది. మరికొంత మంది కస్టమర్లు ఏటీఎం డిపాజిట్ మెషిన్ల ద్వారా డిపాజిట్ చేసుకోగా, కొంత మంది గోల్డ్ కొనడానికి ప్రయత్నాలు చేశారు.