
దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా దర్శక నిర్మాతలతో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరికీ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని అన్నారు. వారికి టెర్రరిస్టులతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు జరపాలని మాంఝీ డిమాండ్ చేశారు. కశ్మీరీ పండిట్ లు తిరిగి వెళ్లకుండా ఉగ్రవాద సంస్థలు పన్నిన కుట్రలో భాగంగానే సినిమాను రూపొందించారని విమర్శించారు. బీహార్లో ఈ చిత్రానికి పన్ను రాయితీ ప్రకటించిన మరుసటి రోజే మాంఝీ ఈ వ్యాఖ్యలు చేశారు.
1990లో కశ్మీర్ నుంచి వలస వెళ్లిన కశ్మీరీ పండిట్ల దయనీయ పరిస్థితులను కళ్లకు కట్టేలా కశ్మీర్ ఫైల్స్ సినిమా రూపొందించారు. ఈ చిత్రంపై బీజేపీ ప్రశంసలు కురిపించింది. ప్రధాని నరేంద్రమోడీ సైతం చిత్ర యూనిట్ను అభినందించారు. కానీ ఎన్డీయే కూటమికి చెందిన జితన్ రామ్ మాంఝీ మాత్రం భిన్నంగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది.