జాబ్ కట్స్ గుబులు : హైదరాబాద్ ఐటీ పరిస్థితేంటీ ?

జాబ్ కట్స్ గుబులు :  హైదరాబాద్ ఐటీ  పరిస్థితేంటీ ?

ప్రస్తుతం టెక్  కంపెనీల్లో జాబ్స్ హైరిస్క్ లో పడ్డాయి . ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం, ఇతర మార్కెట్  ప్రతికూల పరిస్థితులతో దిగ్గజ ఐటీ కంపెనీలు వేలల్లో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ట్విట్టర్ , మెటా, అమెజాన్  వంటి సంస్థలతో పాటు మరికొన్ని కంపెనీలు కూడా అదే దారిలోనే ఉన్నాయనే వార్తలు కలవర పెడుతున్నాయి. అయితే ఈ ఎఫెక్ట్  హైదరాబాద్ ఐటీ కారిడార్ పై మాత్రం అంతగా ఉండదని టెక్నాలజీ అసోసియేషన్ మెంబర్స్ అంటున్నారు.

గత కొన్ని వారాల వ్యవధిలో ​​​​​​..

గత కొన్ని వారాల వ్యవధిలో ట్విట్టర్ , మెటా, అమెజాన్  వంటి సంస్థలు వేలాది మంది ఉద్యోగులపై వేటు వేశాయి. 2025 నాటికి 4 నుంచి 6 వేల మంది తొలగిస్తామని  హెచ్ పీ సంస్థ కూడా ప్రకటించింది. ఆర్థిక మాంద్యం భయాలు, మార్కెట్  ఒడిదొడుకులు, ఆదాయ తగ్గడం వంటి కారణాలతో ఉద్యోగులను తొలగిస్తున్నట్టు కంపెనీలు చెబుతున్నాయి. ఈ ఎఫెక్ట్ తో వరల్డ్ వైడ్ గా ఉన్న కొంతమంది టెకీలు ఇంటి బాట పట్టే చాన్స్ ఉంది.

ఈ ఎఫెక్ట్ కొన్ని రోజులు  మాత్రమే.. 

ట్విట్టర్   5 వేల మంది ఉద్యోగులపై వేటు వేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. భారత్  లోనూ 200 మందిని తొలగించారు. ఫేస్ బుక్  మాతృ సంస్థ మెటా కూడా 11 వేల మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఈ కామర్స్  దిగ్గజం అమెజాన్  ప్రపంచవ్యాప్తంగా 10 వేల మందిని తొలగించింది. పెద్ద కంపెనీల పరిస్థితే ఇలా ఉంటే... చిన్న కంపెనీల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుందనే అంచనాలున్నాయి. ఐతే ఈ ఎఫెక్ట్ కొన్ని రోజులు  మాత్రమే ఉంటుందని ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు.  ప్రతీ ఇయర్ ఎండ్ లో  బఫరింగ్ ఉండడం కామన్  అని  టీటా  ప్రెసిడెంట్ సందీవ్ అంటున్నారు.  

పోయే జాబ్స్ కొన్నే.. అవి కూడా ఐదారు నెలల్లో తిరిగొస్తయ్ 

‘‘ హైదరాబాద్ లో ఎన్నో ఇంటర్నేషనల్ లెవెల్ కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 8 లక్షల మంది ఐటీ సెక్టార్ లో పనిచేస్తుంటే... ఈ ఎఫెక్ట్ తో వందలు, వేలల్లో మాత్రమే జాబ్స్ పోతాయి. అవి కూడా మరో ఐదారు నెలల్లో తిరిగి వస్తాయి’’ అని టీటా హైదరాబాద్ సెక్రటరీ  వినయ్ కుమార్ పేర్కొన్నారు. 

ఏ టైమ్ లో తీసేస్తరో అర్ధమైత లేదు 

‘‘ఏ టైమ్ లో జాబ్ లో నుంచి తీసేస్తారో అర్ధం కావడం లేదు. అనుకోకుండా లేఆఫ్ పేరుతో జాబ్ పోతే పరిస్థితి ఏంటి ? ఇప్పటికే కరోనా కారణంగా హైక్ లు ఇవ్వడం లేదు. ఇప్పుడు లేఆఫ్ చేస్తే తీవ్రంగా నష్టపోతాం’’ అని ఐటీ ఉద్యోగి  క్రాంతికుమార్ చెప్పారు.