నమ్మించి మోసం చేస్తుండ్రు .. నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేస్తున్న కేటుగాళ్లు

 నమ్మించి మోసం చేస్తుండ్రు .. నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేస్తున్న కేటుగాళ్లు
  • ఇటీవల జిల్లాలో పెరిగిన మోసాలు.. పలు కేసులు నమోదు 
  • తాజాగా డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరుతో 400 మందికి టోకరా
  • ఆందోళనకు దిగిన బాధితులు 

ఆదిలాబాద్, వెలుగు-: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించి నిరుద్యోగులను మోసం చేస్తున్న ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. వ్యక్తులే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని లక్షలు వసూలు చేస్తూ బోర్డు తిప్పేస్తున్నాయి. ఉన్నత చదువు చదివి ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు నిండా ముంచుతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేసి డిజిటల్ మైక్రో ఫైనాన్స్ సంస్థ ఇప్పుడు బోర్డు తిప్పేసింది. దీంతో న్యాయం చేయాలని కోరుతూ నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. 

గవర్నమెంట్ జాబ్ అంటూ ఎర..

ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఉద్యోగాల కోసం లక్షల మంది యువత ఎదురుచూస్తున్నారు. పదుల సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్​వచ్చినా వేల సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే కొంత మంది అక్రమ మార్గంలో గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఎర వేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ, వైద్య ఆరోగ్య, వ్యవసాయ, డీఆర్డీవో, ఎక్సైజ్, రైల్వే శాఖల్లో గతంలో సైతం జాబ్​లు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఫేక్ ఐడీలు, ఫేక్ లెటర్లు సృష్టించి నియామక పత్రాలు అందించిన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రతి శాఖలో ఉద్యోగం కోసం రూ.లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కూడా బాధితుల జాబితాలో ఉన్నారు. ఇలా అక్రమ దందాలు చేస్తూ కేటుగాళ్లు కోట్లు వసూలు చేస్తుం డగా.. అమాయకులు మోసపోతున్నారు. 

జిల్లాలో ఇటీవల జరిగిన నిరుద్యోగుల మోసం చేసిన ఘటనలు

  • డీఆర్డీవోలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ జైనథ్​కు చెందిన పోతిపల్లి ప్రశాంత్ అనే వ్యక్తి ఓ నిరుద్యోగిని మోసం చేశాడు. ఆదిలాబాద్​కు చెందిన కృష్ణచారి.. ప్రశాంత్​ను ఉద్యోగంలో పెట్టిస్తానని నమ్మించి రూ.2 లక్షలు బేరం కుదుర్చుకొని రూ.లక్ష వసూలు చేశాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు అడిగినా ఉద్యోగం ఇప్పించకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. జూన్ 9న ఆదిలాబాద్ వన్ టౌన్​లో కేసు నమోదైంది.
  • ఆదిలాబాద్​కు చెందిన మహేశ్వరికి రిమ్స్ హాస్పిటల్​లో నర్సు ఉద్యోగం ఇప్పిస్తానంటూ భూపాలపల్లి జిల్లాకు చెందిన గజ్జె రాజ్ కుమార్ రూ.1.40 లక్షలు వసూలు చేసిండు. ఏఎన్ఎం చదివిన బాధితురాలు ఉద్యోగం వస్తుందని నమ్మి రాజ్​కుమార్​అకౌంట్​కు అడిగిన మొత్తాన్ని పంపింది. అయితే నిందితుడు రోజురోజుకూ వాయిదా వేస్తూ వస్తుండడంతో మోసపోయానని గుర్తించి మార్చి 30న ఫిర్యాదు చేయడంతో వన్ టౌన్​లో కేసు నమోదైంది. జూలై 11న అతడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.
  • ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఫేక్ ఐడీ, ఫేక్ లెటర్లను తయారు చేసి ఆదిలాబాద్​కు చెందిన పలువురు నిరుద్యోగుల నుంచి రూ.7 లక్షలు వసూలు చేసిన హైదరాబాద్​కు చెందిన వినయ్ కుమార్​ను  రెండు నెలల క్రితం ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 
  • జిల్లాలో ఉద్యోగాల పేరుతో 400 మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన డిజిటల్ మైక్రో ఫైనాన్స్ యజమాని జె.కృష్ణ బోర్డు తిప్పేసిండు. విషయం తెలుసుకున్న బాధితులు బుధవారం జిల్లా కేంద్రంలోని రాంనగర్ ఆఫీస్ ​ముందు ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల నిరుద్యోగల వద్ద రూ.20 వేల నుంచి రూ. 1 లక్ష వరకు వసూలు చేశాడు. బోర్డు తిప్పేయడంతో బాధితులు 
  • లబోదిబోమంటున్నారు.