లీగల్ మెట్రాలజీ డిపార్ట్​మెంట్​లో ఫేక్ సర్టిఫికెట్లతో కొలువులు

లీగల్ మెట్రాలజీ డిపార్ట్​మెంట్​లో ఫేక్ సర్టిఫికెట్లతో కొలువులు
  • లోకాయుక్త ఎంక్వైరీతో డీఎల్ఎంవో  రివర్షన్
  • జడ్పీలో మరో ఇద్దరిపై కొనసాగుతున్న ఎంక్వైరీ 
  • లీగల్​మెట్రాలజీలో నకిలీలు మస్తుగున్నరు 

కరీంనగర్ జిల్లా లీగల్ మెట్రాలజీ డిపార్ట్​మెంట్​లో ఆఫీసర్ గా పనిచేస్తున్న రవీందర్ టెక్నికల్ అసిస్టెంట్ నుంచి ఇన్ స్పెక్టర్ గా ప్రమోషన్ కోసం అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సీటీలో బీఎస్సీ చదివినట్లు సర్టిఫికెట్ తెచ్చాడు. కానీ ఇందులో ఫిజిక్స్ లో పాస్ కాకుండానే అయినట్లు ఉంది. ఇది ఫేక్ అంటూ కొందరు  కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీకి ఫిర్యాదు చేశారు.  ఆ తర్వాత లోకాయుక్తలో కేసు నమోదైంది. లోతుగా ఎంక్వైరీ చేసిన లోకాయుక్త.. సదరు యూనివర్సిటీ నుంచి పూర్తి వివరాలు తెప్పించుకోవడంతో సర్టిఫికెట్ నకిలీదని తేలింది. దీంతో అతడిని డీఎల్ఎంవో నుంచి టెక్నికల్ అసిస్టెంట్ గా రివర్షన్ చేశారు. 

కరీంనగర్, వెలుగు: రాత్రింబవళ్లు కష్టపడి మెరిట్ లో ఉద్యోగాలు సంపాదించడం ఇప్పుడున్న కాంపిటీషన్ లో కష్టంగా మారింది. కానీ కొందరు ఫేక్ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగాలు పొంది రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఫేక్ గాళ్లతో అర్హులైన నిరుద్యోగులకు తీవ్రనష్టం జరుగుతోంది. ఇటీవల జిల్లా లీగల్ మెట్రాలజీ డిపార్ట్​మెంట్​లో ఆఫీసర్ గా పని చేసే ఓ అధికారి నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ప్రమోషన్​ పొందినట్లు లోకాయుక్త ఎంక్వైరీలో తేలడంతో పాత పోస్ట్​కే మళ్లీ పంపారు. ఇలా జిల్లావ్యాప్తంగా కొందరు ఫేక్ సర్టిఫికెట్లతో సర్కారు కొలువులు సంపాదించిన వారిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే వారి వ్యవహారం బయటకు వస్తుంది.  లేకపోతే దర్జాగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సర్టిఫికెట్లు నిజమైనవా, నకిలీవా అనేది ఉన్నతాధికారులు చెక్ చేయడం లేదు. 

లీగల్ మెట్రాలజీలో ఇల్లీగల్

ఉమ్మడి జిల్లాలో లీగల్ మెట్రాలజీ  శాఖలో పనిచేస్తున్న మరికొందరు కూడా ఇట్లనే ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొద్దిరోజుల కింద ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న ఓ ఇద్దరు ఉద్యోగులపై ఫిర్యాదులు రావడంతో ఎంక్వైరీ జరుగుతోంది.  లీగల్ మెట్రాలజీలో ఇన్ స్పెక్టర్ ప్రమోషన్ పొందాలంటే డిగ్రీలో కచ్చితంగా ఫిజిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. దీని కోసం మన రాష్ట్రంలో చెల్లని పెరియార్, వినాయక మిషన్స్ వంటి యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకొని  ప్రమోషన్లు పొందారు. మరికొందరయితే ఏకంగా బీఏ లో ఫిజిక్స్ చేసినట్లుగా సర్టిఫికెట్లు తెచ్చుకొని ప్రమోషన్లు కూడా పొందారు. ఈ డిపార్ట్ మెంట్ లో పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేస్తే ఇల్లీగల్ గా ఉద్యోగాలు సంపాదించినవారు బయటపడే అవకాశముంది. 

తల్లి ఉద్యోగి.. కొడుక్కి వారసత్వపు కొలువు 

ఇటీవల జడ్పీ లో పీఆర్ ఏఈ గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి విషయం చర్చానీయాంశంగా మారింది. అమ్మ నాన్న ఇద్దరు టీచర్లు. నాన్న చనిపోతే, ప్రభుత్వ ఉద్యోగమున్న తల్లి ఉన్నా.. కొడుక్కి  ఉద్యోగం ఇచ్చారు. అది కూడా ఇంజినీరింగ్​ డిపార్ట్​మెంట్​లో వర్క్​ ఇన్​స్పెక్టర్​గా.. ఇది రూల్స్ కు విరుద్ధం. ఆ తర్వాత ప్రమోషన్ కోసం ముంబాయి నుంచి డిప్లొమా (మెకానికల్), రాజస్థాన్ లోని యూనివర్సిటీ నుంచి బీటెక్ (సివిల్) చేసినట్లు సర్టిఫికెట్లు తెచ్చుకొని ఏఈ గా 2006 ప్రమోషన్ పొందాడు.  16 ఏండ్లు అవుతున్నా నేటికీ ఆయన సర్వీస్ రెగ్యులర్ కాలేదు. ఈయన నియామకం, సర్టిఫికెట్లు సరిగా లేకపోవడంతోనే  రెగ్యులర్ కావడం లేదని సమాచారం. పీఆర్ విజిలెన్స్ వింగ్ లో పనిచేస్తున్న ఈయనపై ఎంక్వైరీ జరుగుతోంది. 

లోతుగా ఎంక్వైరీ చేస్తే మరికొందరు

గతంలో సిరిసిల్ల జిల్లాలో పనిచేసి 317 జీవో  మేరకు కరీంనగర్ జడ్పీకి బదిలీపై వచ్చిన జూనియర్ అసిస్టెంట్ కు  సంబంధించిన  సర్టిఫికెట్లు నకిలీవనే ఆరోపణలు ఉన్నాయి. కరీంనగర్ కు వచ్చిన తర్వాత కూడా ఇక్కడి అధికారులు అతడి సర్టిఫికెట్లు నకిలీవని గుర్తించినట్లు తెలిసింది.  ఈ వివాదం వల్లనే ఈయనకు  పీఆర్సీలు, ఇంక్రిమెంట్లు రావడం లేదు.   ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో  2008 లో  వీఆర్ఏలకు చాలా మందికి ఒకేసారి ప్రమోషన్ ఇచ్చి వీఆర్వోలుగా చేశారు. అప్పట్లో వీఆర్ఏలకు ఏడో తరగతి ఉంటే సరిపోయేది. వీరిలో కొందరు ఫేక్​పదో తరగతి సర్టిఫికెట్లు తెచ్చుకొని  ప్రమోషన్లు తీసుకున్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేపడితే పెద్దఎత్తున నకిలీలు బయటపడతాయి.