- అమెరికా ప్రెసిడెంట్‌తో పీఎం మోడీ సమావేశం
- వైట్ హౌజ్‌లో కీలక చర్చలు
- వైస్ ప్రెసిడెంట్ కమలతోనూ పీఎం భేటీ
- ఇండియా మాకు ముఖ్య భాగస్వామి: కమల
- ఆస్ట్రేలియా, జపాన్ పీఎంలతో మోడీ చర్చలు
వాషింగ్టన్:ఇండియా, అమెరికా బంధంలో సరికొత్త అధ్యాయం మొదలైందని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు. ‘‘రెండు అతి పెద్ద డెమొక్రసీల మధ్య ఈ బంధం మున్ముందు మరింత బలపడుతుంది. ఎంతో పటిష్టంగా, ఇంకెంతో సన్నిహితంగా మారుతుంది” అని ఆశాభావం వెలిబుచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీకి శుక్రవారం వైట్ హౌజ్ ఓవల్ ఆఫీస్ లో ఆయన ఆతిథ్యమిచ్చారు. ప్రెసిడెంట్ హోదాలో మోడీతో ఆయనకు ఇదే తొలి భేటీ. దీన్ని ‘చాలా కీలకమైన’ మీటింగ్ గా మోడీ అభివర్ణించారు. ఇండియా, అమెరికా స్నేహ బంధం నానాటికీ గట్టిపడుతోందన్నారు. కొత్త దశాబ్దం తీరుతెన్నులను నిర్ణయించడంలో బైడెన్ నాయకత్వం కీలకం కానుందన్నారు. ఆయన హయాంలో భారత్, అమెరికా వ్యాపార భాగస్వామ్యం బలోపేతం కావాలన్నారు. అమెరికా అభివృద్ధిలో భారతీయులది కీలక పాత్ర కావడం తనకెంతో సంతోషాన్నిచ్చే సంగతన్నారు. ప్రపంచ క్షేమం కోసం సాంకేతికతను మరింతగా వాడాలని ఈ సందర్భంగా మోడీ పిలుపునిచ్చారు.
అఫ్గానిస్తాన్, ఇండో పసిఫిక్ సహా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై పలు అంశాలపై గంటపాటు చర్చించారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. తర్వాత ఇద్దరూ జాయింట్ ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరికో కమల స్ఫూర్తి అని మోడీ కొనియాడారు. బైడెన్, కమల హయాంలో ఇండో యూఎస్ సంబంధాలు పీక్స్ కు చేరాలని ఆకాంక్షించారు. ‘‘ప్రపంచం కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ వీళ్లిద్దరూ బాధ్యతలు స్వీకరించారు. వాతావరణ మార్పులు, క్వాడ్, కరోనా వంటి పలు సమస్యల పరిష్కారంలో ఎన్నో ఘనతలు సాధించారు” అని అభినందించారు. ‘‘ఇండియా కరోనా సెకండ్ వేవ్‌లో చిక్కుకున్నప్పుడు మీరు సాయం చేశారు. ఓ కుటుంబంలా, చుట్టంలా ఆప్యాయంగా స్నేహ హస్తమందించారు. అమెరికా ప్రభుత్వం, అక్కడి కంపెనీలు, ప్రవాసులు ఆదుకున్నారు. అప్పుడు నాతో మీరు చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తుంచుకుంటా. మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని కమలతో మోడీ అన్నారు. ‘‘ప్రపంచం గతంలో కంటే ఎక్కువగా పరస్పరం కనెక్టయిందిప్పుడు. ఇది నిజమని మనం ఎదుర్కొంటున్న సవాళ్లు కూడా నిరూపించాయి” అని కమల అన్నారు. అమెరికాకు ఇండియా చాలా ముఖ్యమైన భాగస్వామి అన్నారు. త్వరలో వ్యాక్సిన్ ఎగుమతిని మళ్లీ ప్రారంభిస్తామన్న ఇండియా ప్రకటనను స్వాగతించారు.
టెర్రరిజంలో పాక్ పాత్ర ఉంది: కమల
టెర్రరిజంలో పాకిస్తాన్ పాత్ర కూడా ఉందని కమల అన్నారు. అక్కడ టెర్రర్ గ్రూపులు పని చేస్తున్నాయన్నారు. దీనివల్ల అమెరికా, ఇండియా భద్రతపై ప్రభావం పడకుండా పాక్ చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.‘‘ప్రపంచమంతటా ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రమాదంలో ఉన్నాయి. వాటిని కాపాడుకోవడం అత్యవసరం. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, బలోపేతం చేయడం దేశాల బాధ్యత’’ అని అభిప్రాయపడ్డారు. మోడీ, కమల మీటింగ్ వివరాలను విదేశాంగ శాఖ సెక్రెటరీ హర్షవర్ధన్ ష్రింగ్లా వెల్లడించారు. ‘‘టెర్రరిజం ప్రస్తావన రాగా అందులో పాక్ పాత్రను కమల ప్రస్తావించారు. పాక్‌లో టెర్రర్ గ్రూపులున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఆ దేశానికి స్పష్టం చేశారు. క్రాస్ బార్డర్ టెర్రరిజంపై మోడీ మాటలతో ఏకీభవించారు” అని వివరించారు.
మోరిసన్.. ఇండియాకు రండి: మోడీ
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో మోడీ సమావేశమయ్యారు. బైలేటరల్, రీజనల్, గ్లోబల్ ఇష్యూలపై చర్చించారు. కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ (సీఈసీఏ)పై సంప్రదింపులను సమీక్షించారు. మోరిసన్‌ను ఇండియాకు ఆహ్వానించారు. ‘‘ఆస్ట్రేలియాకు గొప్ప మిత్రుడు, నాకు మంచి స్నేహితుడైన మోడీని కలవడం హ్యాపీగా ఉంది. రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించాం” అని మోరిసన్ చెప్పారు. జపాన్ ప్రధాని యొషిహిడే సుగతో కూడా మోడీ భేటీ అయ్యారు. రక్షణ సహకారాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించారు.
కీలక శక్తిగా క్వాడ్
వాషింగ్టన్: ఇండో పసిఫిక్ ప్రాంతంలోనే గాక ప్రపంచమంతటా శాంతి నెలకొల్పడంలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియాతో కూడిన క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ (క్వాడ్)ది కీలక పాత్ర కానుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ప్రపంచ మేలు కోసం పాటుపడే కీలక శక్తిగా క్వాడ్ ఎదగనుందన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం వాషింగ్టన్ వైట్ హౌజ్ లో క్వాడ్ నేతల సమిట్ లో ప్రసంగించారు. యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్, ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులు స్కాట్ మారిసన్, యొషిహిడే సుగతో పాటు ఫారిన్ మినిస్టర్ ఎస్.జైశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డొబాల్, ఫారిన్ సెక్రెటరీ హెచ్ వీ ష్రింగ్లా ఇందులో పాల్గొన్నారు. ‘‘2004 సునామీ సమయంలో ఇండో పసిఫిక్ ప్రాంతానికి వీలైనంత సాయం చేసేందుకు మన నాలుగు దేశాలు తొలిసారి సమావేశమయ్యాయి. తర్వాత ఇప్పుడు కరోనా మమమ్మారిపై ప్రపంచమంతా పోరాడుతున్న వేళ మానవాళి సంక్షేమం కోసం మనమంతా మళ్లీ ఇలా కలిశాం” అని మోడీ అన్నారు. క్వాడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇండో పసిఫిక్ ప్రాంతానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం కలిసి పని చేయాలని ఆర్నెల్ల క్రితం కలిసినప్పుడు తీర్మానం చేసుకున్నామని బైడెన్ గుర్తు చేశారు. ఆ దిశగా అద్భుతమైన ప్రోగ్రెస్ కనిపిస్తోందని చెప్పారు.
స్టూడెంట్లకు క్వాడ్ ఫెలో షిప్: బైడెన్
యూఎస్ లో స్టెమ్ రీసెర్చ్ ల్లో క్వాడ్ దేశాల స్టూడెంట్లు కీలక పాత్ర పోషించాలని బైడెన్ అన్నారు. వారికోసం క్వాడ్ ఫెలో షిప్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. కాగా, క్వాడ్ సమ్మిట్‌పై చైనా అక్కసు వెళ్లగక్కింది. ట్రెండ్‌కు, రీజియన్ లోని తోటి దేశాల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ముఠా కడితే ఎవరి మద్దతూ దొరకదంటూ నొసలు విరిచింది. క్వాడ్ భేటీలో ఇతర దేశాలను, వాటి ప్రయోజనాలను టార్గెట్ చేయొద్దని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ అన్నారు. ప్రపంచ శాంతి నిర్మాత చైనాయేనని చెప్పుకొచ్చారు.
