ప్రమాణం తర్వాత ఫస్ట్ లేడీ జిల్, కమలతో కలిసి వైట్‌హౌస్‌కు బైడెన్
17 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేయనున్న ప్రెసిడెంట్
ప్రమాణానికి ముందే ఫ్లోరిడాలోని తన ఎస్టేట్‌కు వెళ్లిపోయిన ట్రంప్
జనాలు లేరు..! అట్టహాసమైన వేడుకలూ లేవు.. అడుఅడుగునా ఆర్మీ పహారా! చాలా సింపుల్‌గా, అతికొద్ది మంది గెస్టుల సమక్షంలో సతీసమేతంగా అమెరికాకు 46వ ప్రెసిడెంట్‌గా జో బైడెన్ ప్రమాణం చేశారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు (అమెరికా టైం) దేశ చట్టసభ అయిన వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్‌లో అధిపతిగా సైన్ ఇన్ అయ్యారు. తర్వాత ఫస్ట్ లేడీ జిల్ బైడెన్‌తో కలిసి.. సకల మర్యాదలు, భద్రతతో వైట్‌హౌస్‌లో అడుగుపెట్టారు. అంతకుముందు 49వ వైస్‌ప్రెసిడెంట్‌గా ఇండియన్ అమెరికన్కమలా హారిస్ ప్రమాణం చేశారు. అమెరికా చరిత్రలో పెద్ద వయసు ప్రెసిడెంట్‌గా బైడెన్ నిలిస్తే.. తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్‌గా కమల రికార్డులకెక్కారు. ప్రమాణ కార్యక్రమానికి మాజీ ప్రెసిడెంట్లు ఒబామా, బుష్, క్లింటన్ దంపతులు సహా వెయ్యి మంది గెస్ట్‌లే హాజరయ్యారు. ఇక, తన సొంతూరు డెలావర్ను వీడుతూ బైడెన్ కంటతడి పెట్టుకున్నారు. చనిపోయిన కొడుకును గుర్తు చేసుకుని భారమైన మనసుతోనే అక్కడి నుంచి బయల్దేరారు. కాగా, వైట్‌హౌస్‌కు వచ్చాక 17 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ఆయన సంతకం చేయనున్నారు. ‘మాస్క్మస్ట్’ రూల్స్‌తో తీసుకొచ్చే ఫైల్‌పైనే తొలి సంతకం చేయనున్నారు. ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను రద్దు చేసే ఆర్డర్లపైనా సైన్ పెట్టనున్నారు. మెక్సికో బార్డర్ గోడ నిర్మాణం ఆపేయడం, ముస్లిం దేశాల ప్రజలపై విధించిన ట్రావెల్‌బ్యాన్‌ను ఎత్తేయడం వంటి నిర్ణయాలు తీసుకోనున్నారు.
వాషింగ్టన్: అమెరికా కొత్త ప్రెసిడెంట్ గా జోసెఫ్రాబినెట్ బైడెన్ జూనియర్(78) ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య అగ్రరాజ్యానికి అధినేతగా ఆయన పాలనా పగ్గాలు చేతపట్టారు. వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ బిల్డింగ్ వెస్ట్ ఫ్రంట్ వేదిక వద్ద టైట్ సెక్యూరిటీ ఏర్పాట్ల మధ్య బుధవారం రాత్రి10.30 గంటలకు (లోకల్ టైం ప్రకారం బుధవారం మధ్యాహ్నం12 గంటలకు) ఇరువురు నేతలు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార వేదిక వద్దకు వెళ్లడానికి ముందుగా బైడెన్, కమల తమ ఫ్యామిలీలతో కలిసి డౌన్ టౌన్‌లోని సెయింట్ మ్యాథ్యూ చర్చికి వెళ్లి ప్రార్థనల్లో పాల్గొన్నారు. బైడెన్ ఫ్యామిలీకి సన్నిహితుడు, ప్రీస్ట్ లియో జెరెమియా ఓడొనొవాన్ చేతుల మీదుగా ఇన్వొకేషన్ జరిగింది.
ముందుగా కమల.. తర్వాత బైడెన్
పాప్ స్టార్ లేడీ గాగా జాతీయ గీతాన్ని పాడటంతో వేడుకలు షురూ అయ్యాయి. ఉదయం11.45 గంట లకు అమెరికా 49వ వైస్ ప్రెసిడెంట్ గా కమలా హారిస్ చేత సుప్రీంకోర్ట్ జడ్జి జస్టిస్ సోనియా సొటొమేయర్ ప్రమాణం చేయించారు. తర్వాత జెన్నిఫర్ లొపెజ్ మ్యూజికల్ పర్ఫామెన్స్ కొనసాగింది. సరిగ్గా మధ్యాహ్నం12 గంటలకు ప్రెసిడెంట్‌గా బైడెన్‌తో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. అమెరికా హిస్టరీలోనే ఓల్డెస్ట్ ప్రెసిడెంట్‌గా బైడెన్ నిలవగా.. వైస్ ప్రెసిడెంట్ పగ్గాలు చేపట్టిన తొలి మహిళ, తొలి ఇండో అమెరికన్, తొలి ఆఫ్రికన్ అమెరికన్‌గా కమల హిస్టరీ క్రియేట్ చేశారు. బైడెన్ ప్రమాణ స్వీకారానికి ట్రంప్ డుమ్మా కొట్టారు. మాజీ ప్రెసిడెంట్లు ఒబామా, బుష్, క్లింటన్, వారి భార్యలతో సహా హాజరయ్యారు. మైక్ పెన్స్ సహా వెయ్యి మంది గెస్టులు వేడుకలకు హాజరయ్యారు.
తెల్లజాతి ఆధిపత్యం, డొమెస్టిక్ టెర్రరిజం ఓడిపోతాయి. ఈ పోరాటంలో ప్రతి అమెరికన్ నాతో చేతులు కలపాలని కోరుతున్నా. నేను అమెరికన్లందరికీ ప్రెసిడెంట్ గా ఉంటా. అమెరికాను ఏకం చేయడమే నా ఏకైక లక్ష్యం.
– ప్రమాణ స్వీకారం తర్వాత బైడెన్
ప్రధాని మోడీ కంగ్రాట్స్
అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ హారిస్‌లకు మన ప్రధాని మోడీ కంగ్రాట్స్ చెప్పారు. వారితో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానని తెలిపారు.
స్కూల్ లీడర్ నుంచి..
జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్ 1942 నవంబర్ 20న పెన్సిల్వెనియాలోని క్యాథలిక్ కుటుంబంలో పుట్టారు. ఆయన తండ్రి కార్ల సేల్స్‌మన్‌గా, ఫర్నెస్‌ల క్లీనర్‌గా పని చేశారు. చదువుకునే రోజుల్లో బైడెన్ క్లాసు లీడర్‌గా ఉండేవారు. ఫుట్ బాల్, బేస్ బాల్ ఆడేవారు. డెలావర్ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్ట్స్ చదివారు. 1968లో సిరాక్యూస్ వర్సిటీ నుంచి లా పట్టా పొందారు. తొలిసారి 1972లో డెలావర్ నుంచి సెనేటర్‌గా గెలిచారు. 29 ఏండ్ల వయసులోనే యంగెస్ట్ సెనేటర్‌గా పేరు పొందారు. ఆరుసార్లు ఆ రాష్ట్ర సెనేటర్‌గా పనిచేశారు. అధ్యక్ష పదవికి 1988లో, 2008 లో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. బైడెన్ మొదటి భార్య నీలియా, 13 నెలల కూతు రు నయోమి 1972లో యాక్సిడెంట్‌లో మరణించారు. కొడుకులు బియూ, హంటర్ తీవ్రంగా గాయపడ్డారు. 1977లో జిల్ జాకబ్ ను బైడెన్ పెళ్లాడారు. 1981లో యాష్‌లీ పుట్టింది. 2015లో బియూ 46 ఏండ్ల వయసు లో బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోయారు.
ఈసారి డిఫరెంట్‌గా..
బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవం ఇంతకుముందెన్నడూ చూడని విధంగా జరిగింది. కరోనా కేసులు పెరుగుతుం డటం, క్యాపిటల్ దాడి నేపథ్యంలో చాలా వరకు కార్యక్రమాలను తగ్గించారు. మరిన్ని వర్చువల్‌గా ప్లాన్ చేశారు. ఇంకొన్ని తక్కువ మందితోనే కానిచ్చేశారు.
జనాల ప్లేస్‌లో జెండాలు
మామూలుగా అయితే ప్రెసిడెంట్ ప్రమాణానికి వేలాది మంది ప్రజలు హాజరవుతారు. ఈసారి సెక్యూరిటీ, కరోనా కారణంగా కొంత మందికే అవకాశం ఇచ్చారు. జనాల ప్లేస్‌లో 2 లక్షల జెండాలను సెట్ చేశారు.
ట్రంప్ రాలె
కొత్త అధ్యక్షుని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దిగిపోయే ప్రెసిడెంట్ వస్తుంటారు. కానీ తాను కార్యక్రమానికి రానని ట్రంప్ ముందే చెప్పారు. ఆండ్రూ జాన్సన్ తర్వాత మళ్లీ ఈయనే ఇలా ఈవెంట్‌కు హాజరు కాకుండా ముందే వైట్‌హౌస్ విడిచి వెళ్లిపోయారు.
ఇన్‌సైడ్ అటాక్.. ఎఫ్‌బీఐ నిఘా
ఇన్ సైడ్ అటాక్ జరగొచ్చని డిఫెన్స్ అధికారులు హెచ్చరించడంతో వాషింగ్ట న్ ప్రాంతంలో ఎఫ్‌బీఐ సెక్యూరిటీ పెంచింది. క్యాపిటల్ బిల్డింగ్‌పై దాడిలో మిలటరీ సిబ్బంది కూడా పాల్గొన్నారనే వార్తల నేపథ్యంలో నిఘా పెట్టింది.
ఫుల్ సెక్యూరిటీ
బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎలాంటి మిస్టేక్ జరగకుండా అధికారులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. వాషింగ్టన్‌లో 20 వేల మంది నేషనల్ గార్డ్ ట్రూప్స్ పహారా కాశారు.
వర్చువల్‌గా ఇనాగ్యురేషన్ పరేడ్
ఇనాగ్యురేషన్ కార్యక్రమం తర్వాత జరిగే పరేడ్‌ను ప్లానింగ్ కమిటీ రద్దు చేసింది. వర్చువల్ పరేడ్‌ను ప్లాన్ చేసింది. 50 రాష్ట్రాలు ఇందులో పాల్గొన్నాయి. డైరెక్టర్, ప్రొడ్యూసర్ టోనీ గోల్డ్‌విన్ ఈ పరేడ్‌కు హోస్ట్ గా వ్యవహరించారు.
ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీ
బైడెన్ ప్రమాణం నేపథ్యంలో ఎయిర్‌పోర్టులు, ఎయిర్స్ లైన్స్ సంస్థలు తమ సెక్యూరిటీని మరింత పెంచాయి. రూల్స్ కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే భారీ ఫైన్లు వేస్తామని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.
‘ఇనాగ్యురల్ బాల్స్’ బదులు
ప్రెసిడెంట్ ప్రమాణం చేసిన తర్వాత ఇనాగ్యురల్ బాల్స్ పేరుతో జరిగే సోషల్ గ్యాదరింగ్ ఈసారి జరగలేదు. దానికి బదులుగా బైడెన్ ఇనాగ్యురల్ కమిటీ ‘సెలబ్రేటింగ్ అమెరికా’ పేరుతో 90 నిమిషాల టీవీ కార్యక్రమం నిర్వహించింది.
