IND vs ENG 2025: సచిన్ ఒక్కడే మిగిలాడు.. మాంచెస్టర్ టెస్టులో రూట్ రికార్డుల వర్షం!

IND vs ENG 2025: సచిన్ ఒక్కడే మిగిలాడు.. మాంచెస్టర్ టెస్టులో రూట్ రికార్డుల వర్షం!

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌‌ జో రూట్‌‌ టెస్టుల్లో సూపర్ ఫామ్ తో అదరగొడుతున్నాడు.  తన పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తూ ఒక్కో రికార్డ్ బ్రేక్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇంగ్లాండ్ తరపున ఆల్ టైం గ్రేట్ బ్యాటర్ గా నిలిచిన ఈ ఇంగ్లీష్ స్టార్ బ్యాటర్ ప్రపంచ రికార్డ్స్ పై కన్నేశాడు. ప్రస్తుతం టీమిండియాతో మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో 14 ఫోర్లతో 150 పరుగులు చేసి దిగ్గజాలను వెనక్కి నెట్టాడు. రూట్ టెస్ట్ కెరీర్ లో ఇది 38 వ సెంచరీ కాగా.. ఈ సిరీస్ లో రెండోది. తన సూపర్ సెంచరీతో రూట్ బద్దలు కొట్టిన రికార్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. 

అత్యధిక టెస్ట్ పరుగుల లిస్ట్ లో రెండో స్థానం:

మాంచెస్టర్ టెస్టుకు ముందు టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన లిస్ట్ లో రూట్ ఐదో స్థానంలో నిలిచాడు. అయితే నాలుగో టెస్టులు భారీ సెంచరీతో రూట్ ఏకంగా ముగ్గురు దిగ్గజ క్రికెటర్లను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకోవడం విశేషం. మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ (13288 రన్స్), దక్షిణాఫ్రికా గ్రేట్ ఆల్ రౌండర్ జాక్వెస్ కల్లిస్ (13289), ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రికీ పాంటింగ్ (13377) రికార్డును బద్దలు కొట్టి టెస్ట్ క్రికెట్‏లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. తొలి స్థానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (15921) అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. 

ALSO READ : IND vs ENG 2025: బుమ్రా రిటైర్మెంట్ ఇస్తాడు.. కారణం ఇదే: టీమిండియా మాజీ బ్యాటర్

స్వదేశంలో అత్యధిక సెంచరీలు:  

మాంచెస్టర్లో జరుగుతోన్న సెంచరీతో సొంతగడ్డపై 23 సెంచరీలు పూర్తి చేసుకున్న రూట్ స్వదేశంలో టెస్టుల్లో ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో మహేళ జయవర్థనే (23), జాక్వెస్ కల్లిస్ (23)తో కలిసి సంయుక్తంగా రూట్ అగ్రస్థానంలో  కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో సచిన్ (22) రికార్డును బద్దలు కొట్టాడు.

సొంత మైదానంలో అత్యధిక టెస్ట్ సెంచరీలు:

1  జో రూట్: 84 మ్యాచ్‌ల్లో 23 సెంచరీలు

2  మహేల జయవర్ధనే: 81 మ్యాచ్‌ల్లో 23 టన్నులు

3  జాక్వెస్ కల్లిస్: 88 మ్యాచ్‌ల్లో 23 సెంచరీలు

4  రికీ పాంటింగ్: 92 మ్యాచ్‌ల్లో 23 సెంచరీలు

5  సచిన్ టెండూల్కర్: 94 మ్యాచ్‌ల్లో 22 సెంచరీలు

టీమిండియాపై అత్యధిక టెస్ట్ సెంచరీలు:

మాంచెస్టర్ టెస్టులో సెంచరీ కొట్టిన రూట్ తన కెరీర్ లో 38 వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ పై రూట్ కు ఇది 12 టెస్ట్ సెంచరీ కావడం విశేషం. దీంతో టెస్టుల్లో టీమిండియాపై అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా రూట్ రికార్డ్ సృష్టించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ (11) ను వెనక్కి నెట్టి అధికారికంగా అగ్ర స్థానానికి చేరుకున్నాడు. స్టీవ్ స్మిత్ రెండో స్థానానికి పడిపోగా.. గ్యారీ సోబర్స్, వివియన్ రిచర్డ్స్ ,రికీ పాంటింగ్ 8 సెంచరీలతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. 

టీమిండియాపై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు: 

1. జో రూట్ - 12 సెంచరీలు

2. స్టీవెన్ స్మిత్ - 11 సెంచరీలు

3. రికీ పాంటింగ్ - 8 సెంచరీలు

3. వివియన్ రిచర్డ్స్ - 8 సెంచరీలు

3. గ్యారీ సోబర్స్ - 8 సెంచరీలు