
- రాణించిన పోప్, స్టోక్స్.. నితీశ్‌కు రెండు వికెట్లు
లండన్: ఇండియాతో గురువారం మొదలైన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌కు శుభారంభం లభించింది. జో రూట్ (191 బాల్స్‌లో 9 ఫోర్లతో 99 బ్యాటింగ్), ఒలీ పోప్ (44) రాణించడంతో.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 251/4 స్కోరు చేసింది. రూట్‌తో పాటు బెన్ స్టోక్స్ (39 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. నితీశ్ రెడ్డి రెండు వికెట్లు తీశాడు. ప్రసిధ్ కృష్ణ ప్లేస్‌లో బుమ్రా టీమిండియా తుది జట్టులోకి వచ్చాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (18), బెన్ డకెట్ (23) తొలి గంటలో నెమ్మదిగా ఆడారు. దీనికి తోడు పిచ్‌పై స్లోప్ ఉండటం వల్ల రనప్‌లో కుదురుకోవడానికి ఇండియన్ పేస్ త్రయం బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్ కాస్త టైమ్ తీసుకున్నారు. బుమ్రా పెవిలియన్, నర్సరీ ఎండ్‌ల నుంచి బౌలింగ్ చేసినా తొలి సెషన్‌లో వికెట్ తీయలేకపోయాడు.
ఆకాశ్ దీప్ నర్సరీ ఎండ్ నుంచి కొత్త బాల్‌తో మంచి లైన్ అండ్ లెంగ్త్‌ను రాబట్టినా సక్సెస్ కాలేదు. తొలి గంటలో వికెట్ పడకపోవడంతో కెప్టెన్ గిల్.. ఆకాశ్ దీప్ ప్లేస్‌లో నితీశ్‌ను బౌలింగ్‌కు దించాడు. ఈ స్ట్రాటజీ ఫలించింది. 14వ ఓవర్‌లో నాలుగు బాల్స్ తేడాలో డకెట్, క్రాలీని ఔట్ చేసి డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. నితీశ్ వేసిన షార్ట్ బాల్‌ను డకెట్ లెగ్ సైడ్ ఆడబోయి వికెట్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాతి బాల్‌కే ఒలీ పోప్ ఇచ్చిన క్యాచ్‌ను గల్లీలో గిల్ అందుకోలేకపోయాడు. కానీ ఔట్ సైడ్ లెంగ్త్‌తో విసిరిన చివరి బాల్‌ను వెంటాడిన క్రాలీ మళ్లీ పంత్ చేతికి చిక్కాడు. దీంతో ఇంగ్లండ్ 44/2 స్కోరుతో నిలిచింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన నితీశ్‌ను ‘బాగుందిరా.. మామ’ అంటూ గిల్ తెలుగులో పొగిడాడు. ఈ దశలో వచ్చిన రూట్.. పోప్‌తో కలిసి ఇన్నింగ్స్‌లో నిలకడ తెచ్చాడు. చెత్త బాల్స్‌ను మాత్రమే బౌండ్రీలకు తరలిస్తూ క్రీజులో కుదురుకున్నారు. ఈ ఇద్దరు ఎలాంటి చాన్స్ ఇవ్వకపోవడంతో ఇంగ్లండ్ 83/2తో లంచ్‌కు వెళ్లింది.
నో వికెట్.. పంత్‌కు గాయం!
రెండో సెషన్ మొత్తం ఇంగ్లండ్ ఆధిపత్యమే నడిచింది. పిచ్ నుంచి సహకారం లేకపోవడంతో ఇండియన్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. అదే టైమ్‌లో బజ్‌బాల్ స్ట్రాటజీని పక్కనబెట్టి రూట్, పోప్ క్లాసిక్ టెస్ట్ మ్యాచ్ బ్యాటింగ్‌ను చూపెట్టారు. దాంతో సెషన్ నెమ్మదిగా నడిచినా రన్‌రేట్ మాత్రం తగ్గలేదు. ఓ వైపు వికెట్లు పడటం లేదనే బాధలో ఉన్న టీమిండియాకు 35వ ఓవర్‌లో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఓవర్‌లో బుమ్రా వేసిన లెగ్ సైడ్ బాల్‌ను డైవ్ చేసి ఆపే క్రమంలో వికెట్ కీపర్ పంత్ ఎడమ చూపుడు వేలికి గాయమైంది. తీవ్రమైన నొప్పితో ఇబ్బందిపడిన పంత్‌కు ఫిజియో గ్రౌండ్‌లోనే చికిత్స అందించాడు. అయినా తగ్గకపోవడంతో బుమ్రా ఓవర్ తర్వాత అతను మైదానాన్ని వీడాడు. పంత్ ప్లేస్‌లో ధ్రువ్ జురెల్ కీపింగ్ చేశాడు.
ఆఫ్ స్టంప్ బాల్స్‌ను వదిలేసిన ఈ జంట 24 ఓవర్లలో 70 రన్స్ జోడించి 153/2తో టీ బ్రేక్‌కు వెళ్లింది. ప్రస్తుతం పంత్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. మూడో సెషన్ తొలి బాల్‌కే పోప్‌ను జడేజా బోల్తా కొట్టించాడు. ఫలితంగా మూడో వికెట్‌కు 109 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. మరో నాలుగు ఓవర్ల తర్వాత బుమ్రా దెబ్బకు హ్యారీ బ్రూక్ (11) పెవిలియన్‌కు చేరాడు. 19 రన్స్ తేడాతో రెండు కీలక వికెట్లు పడటంతో ఇంగ్లండ్ స్కోరు 172/4గా మారింది. అయితే ఓ ఎండ్‌లో వికెట్లు పడినా రూట్ మాత్రం మొండిగా ఆడాడు. డెడ్ డిఫెన్స్‌కు ప్రాధాన్యమిస్తూ వికెట్‌ను కాపాడుకున్నాడు. కొత్తగా వచ్చిన స్టోక్స్ కూడా సింగిల్స్‌తో రూట్‌కు అండగా నిలిచాడు. ఈ ఇద్దరు వికెట్ ఇవ్వకుండా ఐదో వికెట్‌కు 79 రన్స్ జత చేసి రోజు ముగించారు.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 83 ఓవర్లలో 251/4
(రూట్ 99*, స్టోక్స్ 39*, నితీశ్ 2/46).
13 అన్ని ఫార్మాట్లలో కలిపి వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన తొలి జట్టు ఇండియా. 1999లో వెస్టిండీస్ (12) నెలకొల్పిన చెత్త రికార్డును టీమిండియా అధిగమించింది.