జోగులాంబ అభివృద్ధికి సహకరించండి

జోగులాంబ అభివృద్ధికి సహకరించండి
  • బండి సంజయ్‌ను కలిసిన టెంపుల్ చైర్మన్ ,ఈవో 

అలంపూర్, వెలుగు: జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాల అభివృద్ధికి సహకారం అందించాలని ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఆలయ ఈవో పురందర్ కుమార్..బీజేపీ స్టేట్‌ చీఫ్ బండి సంజయ్‌ను కోరారు.  మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ పార్టీ ఆఫీసులో ఆయనను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదానం చేసేందుకు దాతల సహకారం ఉన్నా.. భక్తుల సంఖ్యకు తగ్గట్టుగా అన్నదాన సత్రం నిర్మించేందుకు కేంద్ర పురాతత్వ శాఖ అధికారులు స్థలం ఇవ్వడం లేదని చెప్పారు.

ఇటీవల ఎంపీ నిధుల నుంచి రెండు హైమాస్ట్‌ లైట్లు మంజూరైనా.. ఏర్పాటు చేయనివ్వడం లేదన్నారు. పుష్కర ఘాటు ముందున్న ఖాళీ స్థలంలో సత్రం నిర్మిస్తే ప్రతిరోజూ 600 మందికి అన్నదానం చేసే అవకాశం ఉంటుందని ఇందుకోసం కేంద్రంతో మాట్లాడాలని కోరారు.  అలాగే  నవబ్రహ్మాలయాలను దేవాదాయ శాఖకు అప్పగిస్తే అర్చకులు, సిబ్బందిని నియమించి నిత్య పూజలు చేస్తామన్నారు. వారి వెంట ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ ఉన్నారు.