
- జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్
గద్వాల, వెలుగు: కృష్ణానదికి వస్తున్న వరదలతో ఎలాంటి విపత్తులు వచ్చినా ఎదుర్కొనేందుకు పోలీసులు రెడీగా ఉండాలని జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఆదేశించారు. బుధవారం గద్వాల, వనపర్తి ఎస్పీలు శ్రీనివాసరావు, రావుల గిరిధర్ తో కలిసి జూరాల ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణానదికి వరదలు వస్తే గద్వాల జిల్లాలో ఆరు గ్రామాలు, వనపర్తి జిల్లాలో ఆరు గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన చర్యలపై పోలీస్ శాఖకు వివిధ శాఖల అధికారులు పలు సూచనలు చేశారని చెప్పారు.
ఇతర శాఖల ఆఫీసర్లతో కో ఆర్డినేషన్ చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వర్షాల దృష్ట్యా ఎలాంటి విపత్తు ఎదురైనా, నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. నది తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనంతరం గద్వాల ఎస్పీ ఆఫీస్‌ను సందర్శించారు. గద్వాల డీఎస్పీ మొగిలయ్య, వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, గద్వాల, అలంపూర్ సీఐలు శీను, రవిబాబు, వనపర్తి సీఐ రాంబాబు ఉన్నారు.