రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకే సొంత పార్టీలోకి: వివేక్ వెంకటస్వామి

రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకే సొంత పార్టీలోకి: వివేక్ వెంకటస్వామి
  • ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సీనియర్‌‌‌‌ నేత కేసీ వేణుగోపాల్‌‌తో భేటీ
  • పాల్గొన్న వివేక్ సతీమణి సరోజ, కుమారుడు వంశీకృష్ణ

న్యూఢిల్లీ, వెలుగు: కేసీఆర్‌‌‌‌ను ఓడించేందుకే కాంగ్రెస్‌‌లో చేరానని మాజీ ఎంపీ, సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. కాంగ్రెస్ తన సొంత పార్టీ అని చెప్పారు. కేసీఆర్ రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు సామాన్య కార్యకర్తగా కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే తమ ఆకాంక్షలు నేరవేరుతాయని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. ‘‘బీఆర్ఎస్ సర్కార్‌‌‌‌ను గద్దె దించే లక్ష్యంతో 2019లో బీజేపీలో జాయిన్ అయ్యా. ఇప్పుడు కూడా ప్రజల ఒత్తిడి మేరకే ఆ పార్టీని వీడి, కాంగ్రెస్‌‌లో చేరుతున్నా. గడిచిన నాలుగేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై మాత్రమే పోరాటం చేశా. ఏ పార్టీనీ విమర్శించలేదు” అని వివరించారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను వివేక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో వివేక్‌‌తోపాటు ఆయన సతీమణి సరోజ, కుమారుడు వంశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గేను శాలువాతో సత్కరించి, పలు పుస్తకాలను బహుకరించారు. తర్వాత సుమారు గంటపాటు ఖర్గేతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత వెంకట స్వామి (కాకా) కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన కృషిని ఖర్గేతో పంచుకున్నారు. కాకాతో ఉన్న బంధాన్ని సైతం ఖర్గే గుర్తు చేసుకున్నట్లు తెలిసింది. తర్వాత ఖర్గే నివాసం ముందు భార్య, కుమారుడితో కలిసి మీడియాతో వివేక్ మాట్లాడారు. రాహుల్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. ఇప్పుడు పార్టీ చీఫ్ ఖర్గేను కలిసి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు.

కేసీఆర్ అన్ని వ్యవస్థలను నాశనం చేసిండు

కాంగ్రెస్ నేతగా ఉద్యమ సమయంలో తెలంగాణ సాధన కోసం ముందడుగు వేశానని వివేక్ వెంకటస్వామి చెప్పారు. అందరి సమష్టి కృషితో వచ్చిన తెలంగాణలో.. అన్ని వ్యవస్థలను కేసీఆర్ నాశనం చేశారని మండిపడ్డారు. కుటుంబ, అవినీతి, నియంతృత్వ పాలనతో రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని ఫైర్ అయ్యారు. గడిచిన నాలుగేండ్లుగా కేసీఆర్ రాక్షస పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రధానంగా కాళేశ్వరం, మిషన్ భగీరథకు వ్యతిరేకంగా ఉద్యమించానన్నారు. ‘‘కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ రీ డిజైన్ చేశారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో మంచిర్యాల, మంథని, చెన్నూరులో లక్షలాది ఎకరాలు మునిగిపోయాయి. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు” అని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పార్టీ మారిన తనపై కొందరు బీజేపీ నేతలు తప్పక విమర్శలు చేస్తున్నారని అన్నారు. తాను బీజేపీలో చేరక ముందు ఆ పార్టీ ఎలా ఉందో.. చేరిన నాలుగేండ్లలో ఆ పార్టీ ఎలా ఎదిగిందో ప్రజలకు తెలుసని అన్నారు.

ప్రజల కోరిక మేరకే కాంగ్రెస్ లో చేరారు: వివేక్ సతీమణి సరోజ

ప్రజల కోరిక మేరకే వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ లో చేరారని ఆయన సతీమణి సరోజ అన్నారు. సొంత గూటికి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఏ పార్టీలో ఉన్నా ప్రజలకు సేవ చేయడమే తమ ధ్యేయమని చెప్పారు. రాహుల్ గాంధీ స్వయంగా వివేక్ వెంకటస్వామిని పార్టీలోకి ఇన్వైట్ చేశారని చెప్పారు. ‘‘సొంత ఇంటికి వచ్చినట్లే అనిపిస్తున్నది. మేం ఇక్కడి వాళ్లమే. బయటి వాళ్లం కాదు. మంచి తీర్పును ఇచ్చి ప్రజలు కాంగ్రెస్ ను గెలిపిస్తారని ఆశీస్తున్నా’’ అని చెప్పారు. కాంగ్రెస్ తోనే తెలంగాణ కు మేలు జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారని వివేక్ కుమారుడు వంశీ అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో తన తాత వెంకట స్వామి, మలిదశ ఉద్యమంలో తన నాన్న వివేక్ పాల్గొని, పోరాడారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నియంతృత్వ పాలన పోవాలంటే కాంగ్రెస్ రావాల్సిందేనని అన్నారు.

కేసీ వేణుగోపాల్‌‌తో భేటీ

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌‌ను వివేక్ తన కుటుంబ సభ్యులతోపాటు మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని వేణుగోపాల్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ మీటింగ్‌‌లో రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చించారు. కాంగ్రెస్‌‌ను అధికారంలోకి తెచ్చే దిశలో అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో తమ పాత జ్ఞాపకాలను నేతలు గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఓడించే దిశలో మరింత జోష్ తో ముందుకెళ్లాలని నిర్ణయించారు.