ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
బీజేపీ నాయకుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి 

కోహెడ, వెలుగు : బీజేపీని బలోపేతం  చేసేందుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని బీజేపీ నాయకుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి అన్నారు. గురువారం మండలంలోని కూరెల్లలో వివిధ పార్టీల నుంచి నాయకులు బీజేపీలో చేరారు. వారికి శ్రీరాం చక్రవర్తి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో హుస్నాబాద్​గడ్డపై కాషాయ జెండా ఎగరేసేందుకు సైనికుల్లా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం, నాయకులు పిల్లి నర్సయ్య, లింగయ్య, తిరుపతి, వెంకటేశ్వర్లు, రవి, నరేశ్​ తదితరులు పాల్గొన్నారు.

మహాచండీ హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే 

మెదక్​ (శివ్వంపేట), వెలుగు: శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద గురువారం భవానీ మాత మాలాధారులు, టీఆర్​ఎస్​ మండల పార్టీ కోశాధికారి బండారి గంగాధర్ సంతోష దంపతులు మహా చండీ హోమం నిర్వహించారు. నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్ రెడ్డి దుర్గామాత అమ్మవారి దర్శించుకొని హోమంలో పాల్గొన్నారు. అనంతరం గుండ్లపల్లి లో 20 వేల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేశ్​గుప్తా, జిల్లా గ్రంథాలయ  సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, సొసైటీ చైర్మన్ వెంకట రామిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

మహాలక్ష్మి రూపంలో అమ్మవారు

పాపన్నపేట, వెలుగు : ఏడుపాయలలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గురువారం వన దుర్గ భవానీ మాత భక్తులకు ఆకుపచ్చరంగులో మహాలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు.  రంగంపేట పీఠాధిపతి మాధవ నంద సరస్వతి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోకుల్ షెడ్ లో నిర్వహిస్తున్న దేవి శరన్నతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. పాలకమండలి చైర్మన్ బాలా గౌడ్, ఆలయ ఈవో సారా శ్రీనివాసులు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూశారు. అన్నదాన కార్యక్రమం చేపట్టారు. 

‘హాండ్లూమ్​’  చైర్మన్​ ప్రభాకర్​కు సన్మానం 

కంది, వెలుగు :  స్టేట్​హ్యాండ్లూమ్ ​డెవలప్​మెంట్​కార్పొరేషన్​ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే  చింతా ప్రభాకర్​ను అందోల్​ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ​సన్మానించారు.  గురువారం సంగారెడ్డి పట్టణంలోని తన క్యాంప్​ కార్యాలయంలో క్రాంతి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు.  కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు , బొంగుల రవి, విజయేందర్ రెడ్డి,  శ్రీనివాస్, మల్లేశం, శ్రావణ్ రెడ్డి, అశ్విన్ తదితరులు పాల్గొన్నారు. 

అంగన్​వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

సిద్దిపేట రూరల్, వెలుగు : అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పోషకాహారం, ఇతర సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ శ్రీదేవి సూచించారు. గురువారం రూరల్ మండల పరిధిలోని రాఘవాపూర్ గ్రామంలో అంగన్​వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక శ్రీమంతాల కార్యక్రమానికి ఆమె చీఫ్​ గెస్టుగా హాజరయ్యారు. సర్పంచ్​​రమేశ్​తో కలసి ఆమె మాట్లాడుతూ మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో అంగన్​వాడీ టీచర్లు సురేఖ, రజిత, వెంకటమ్మ, పవిత్ర, వార్డు సభ్యులు రేణుక,  నాయకులు నర్సింలు, స్వామి పాల్గొన్నారు.

జర్నలిస్టుల పాత్ర కీలకం
టీయూడబ్ల్యూజే మహాసభలో సంగారెడ్డి కలెక్టర్

సంగారెడ్డి టౌన్, వెలుగు : జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తారని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. గురువారం సంగారెడ్డిలోని జడ్పీ సమావేశ మందిరంలో టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా మహాసభ అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, వివిధ సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో రిపోర్టర్ల​ పాత్ర కీలకమన్నారు.  యూనియన్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ మాట్లాడుతూ 65 ఏండ్లలో సంఘం ఎదుగుదలను, పోరాటాల చరిత్రను వివరించారు. సీనియర్ జర్నలిస్టు ఆర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఇన్వెస్టిగేషన్ కథనాలు, సక్సెస్ స్టోరీలను అందించి ఎందరినో ప్రేరేపించవచ్చన్నారు. టెస్కో చైర్మన్ చింతా ప్రభాకర్, బ్రూవరీస్ చైర్మన్ నగేశ్ ​మాట్లాడారు. అనంతరం  కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా బండారి యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా విష్ణు, ప్రసాద్ ను 
ఎన్నుకున్నారు. 

పనులు త్వరగా పూర్తి చేయాలి 

మెదక్​ (చిలప్ చెడ్), వెలుగు:  చిలప్​ చెడ్​ మండలం అజ్జమర్రి, ఫైజాబాద్ గ్రామ పాఠశాలల్లో మన ఊరు మన బడి పనులను గురువారం అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ పరిశీలించారు. చేపట్టిన పనులు నాణ్యతగా ఉండాలని, తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  ఆమె వెంట ఎంఈవో బుచ్య నాయక్, పీఆర్​ ఏఈ మధుబాబు, సీఆర్పీ రాజశేఖర్, ఎస్ఎంసి చైర్మన్ వీరస్వామి ఉన్నారు. 

కాంగ్రెస్ ​ఓబీసీ సెల్ ​మండల అధ్యక్షుడిగా బుర్ర శ్రీనివాస్​గౌడ్

చేర్యాల, వెలుగు :  కాంగ్రెస్​పార్టీ ఓబీసీ సెల్ ​మండల అధ్యక్షుడిగా పార్టీ సీనియర్​నాయకుడు బుర్ర శ్రీనివాస్​గౌడ్​ నియామకమయ్యారు. గురువారం జిల్లా అధ్యక్షుడు లక్కరసు సూర్యచంద్ర వర్మ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బుర్ర శ్రీనివాస్​గౌడ్​ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. నియామకానికి సహకరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, అధికార ప్రతినిధి ధర్మ సంతోష్ రెడ్డి, వి.నర్సయ్య పంతులు, చేర్యాల మండల పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్​, పీఏసీఎస్​ డైరెక్టర్​ కొమ్ము రవి, కౌన్సిలర్లు, పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలిపారు. 

సీసీ రోడ్డు పనులు  ప్రారంభించిన జడ్పీటీసీ

మెదక్ (నిజాంపేట ), వెలుగు : నిజాంపేట మండల కేంద్రంలోని 7వ వార్డులో రూ.5 లక్షల జడ్పీ నిధులతో చేపట్టే సీసీ రోడ్డు పనులను జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా రోజులుగా పెండింగ్​లో ఉన్నా సీసీ రోడ్డుకు జీపీ నిధులు సరిపోకపోతే జడ్పీ చైర్​పర్సన్​ ఫండ్స్​ కేటాయించారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అనూష, ఉప సర్పంచ్ కొమ్మట బాబు, టీఆర్ ఎస్ నాయకులు నర్సింలు, సిద్ధరాంరెడ్డి, కిష్టారెడ్డి, నాగరాజు, స్వామి పాల్గొన్నారు.

ఇద్దరు సైబర్​ నేరగాళ్ల అరెస్టు

చేర్యాల, వెలుగు : సైబర్​ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్​కు పంపినట్లు హుస్నాబాద్​ ఏసీపీ వాసాల సతీష్​ తెలిపారు. గురువారం చేర్యాల సర్కిల్​ ఆఫీస్​లో సీఐ శ్రీనివాస్​తో కలిసి నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన విస్లావత్​ నారాయణ, బాలాజీ రాథోడ్​లు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో గూగుల్​లో సెర్చ్​ చేసి ఆయా గ్రామాల సర్పంచుల ఫోన్​ నంబర్లను సేకరించారు. ఈ క్రమంలో ఈ నెల 22న చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్​కు ఫోన్​ చేసి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద డబ్బులు ఇచ్చేందు కోసం అని చనిపోయిన కుటుంబాల నంబర్లను తీసుకున్నారు. వారికి ఫోన్​ చేసి కలెక్టర్​ఆఫీస్​ నుంచి మాట్లాడుతున్నామని నమ్మించారు. పథకం కింద డబ్బులు వస్తాయని, అందుకు ముందుగా అయ్యే ఖర్చులు భరించాలని ఆ కుటుంబాల నుంచి  రూ. 45వేలు వసూలు చేశారు. తర్వాత మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీస్ ​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు బుధవారం చేర్యాల ఎంపీడీవో ఆఫీస్​వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.41లక్షలు, మూడు సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు చేర్యాల, కొమురవెల్లి, అందోల్​, దుబ్బాక, మహబూబాబాద్​ జిల్లా కురవిలో కూడా నేరాలకు పాల్పడినట్లు ఏసీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఎస్సై భాస్కర్​రెడ్డి, కానిస్టేబుళ్లు భాస్కర్, జీవన్​, వెంకట్, నవీన్, రమేశ్​ను ఆయన అభినందించారు. 

సీఎంఆర్​ఎఫ్ తో  పేదలకు మెరుగైన  వైద్యం
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి 

పటాన్ చెరు, వెలుగు :  నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎంఆర్​ఎఫ్​  ఎంతో ఉపయోగపడుతోందని పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్​పూర్ మున్సిపాలిటీ రూపశ్రీ కాలనీకి చెందిన గరాటరెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం ఇటీవల రూ.2 లక్షల ఎల్ఓసీ మంజూరు చేసింది. గురువారం క్యాంపు ఆఫీస్​లో బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ఎల్ఓసీ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేశ్ యాదవ్  ఉన్నారు. 

‘ఇందూర్’లో బతుకమ్మ సంబురాలు

సిద్దిపేట రూరల్/మెదక్​టౌన్​/పాపన్నపేట, వెలుగు : సిద్దిపేటలోని ఇందూరు ఇంజినీరింగ్ కాలేజ్ లో గురువారం ఘనంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. కాలేజీ  ప్రిన్సిపాల్​ డాక్టర్ వీ.పీ. రాజు వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. కాలేజీలో ప్రతి సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.  విద్యార్థులు బతుకమ్మ ఆటపాటలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ యాదయ్య, పీఆర్వో రఘు, సిబ్బంది డీపీ రావు, డాక్టర్ మల్లేశం, పోచయ్య, ఎల్ ఎన్ రావు, ఎస్ శ్రీనివాస్, పాండురంగం, సరస్వతి, టి. బెనర్జీ, హిమబిందు, రేణుక, భవాని తదితరులు పాల్గొన్నారు. మెదక్​ కలెక్టరేట్​లో, పాపన్నపేట గవర్నమెంట్​ జూనియార్​ కాలేజీలోనూ బతుకమ్మ సంబురాలు నిర్వహించారు.

8 ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు

మెదక్, వెలుగు : మెదక్, రామాయంపేట పట్టణాల్లోని 15 ప్రైవేట్​ ఆసుపత్రుల్లో గురువారం  వైద్యారోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సరైన సర్టిఫికెట్లు లేని 8  ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసినట్లు డీఎంహెచ్​వో  డాక్టర్ విజయ నిర్మల తెలిపారు. ఆయా ఆసుపత్రుల వారు వారం రోజుల్లోగా అనుమతులు పొందనట్టయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డాక్టర్ నవీన్ ఆధ్వర్యంలోని వైద్య బృందం ఈ తనిఖీలు నిర్వహించింది. 

పాపన్నపేట పీఏసీఎస్ చైర్మన్ రాజీనామా

పాపన్నపేట, వెలుగు : పాపన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్​ మోహన్​రెడ్డి ఎన్నికలప్పుడు చేసుకున్న ఒప్పందంలో భాగంగా తన చైర్మన్​ పదవికి రాజీనామా చేశారు. గురువారం పాపన్నపేటలోని ఓ ఫంక్షన్ హాల్ లో  పీఏసీఎస్ మహాజన సభ చేపట్టారు.ఈ  సమావేశానికి 2400 మంది సభ్యలు హాజరు కాగా, వారి సమక్షంలోనే చైర్మన్​ మోహన్​రెడ్డి  తన రాజీనామా పత్రంపై సంతకం చేశారు. ఈ మేరకు జిల్లా కో-ఆపరేటివ్  అధికారికి లేక ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ చందనాప్రశాంత్ రెడ్డి, ఏడుపాయల చైర్మన్ బాలా గౌడ్, స్థానిక సర్పంచ్ గురుమూర్తి గౌడ్, ఎంపీటీసీ శ్రీనివాస్ , పీఏసీఎస్​ వైస్ చైర్మన్ మల్లేశం, కోఆప్షన్ సభ్యులు గౌస్, డైరెక్టర్లు, మాజీ డైరెక్టర్, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు

అభివృద్ధికి ప్రజలు సహకరించాలి

నారాయణ్ ఖేడ్, వెలుగు : పరిపాలనా సౌలభ్యం కోసం ఖేడ్​ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ కొత్త మండలంగా ఏర్పడిందని, ఈ అవకాశాన్ని  ప్రజలందరూ వినియోగించుకుని అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి కోరారు. కొత్త మండలంలో వివిధ ఆఫీసుల ఏర్పాటుకు  బిల్డింగ్ లను సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఆయన వెంట రాష్ట్ర జాగృతి నాయకులు మఠం భిక్షపతి, ఖేడ్ మండల వైస్ ఎంపీపీ సాయిరెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, నిజాంపేట్ సర్పంచ్ జగదీశ్వర చారి, ఎమ్మార్వో దశరథ్ సింగ్ 
ఉన్నారు.  

వెల్ఫేర్​ స్కీమ్స్​ ఆపాలని కేంద్రం కొర్రీలు
మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట రూరల్, వెలుగు : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం ఆపాలని చూస్తోందని, కేంద్రం కోతలు పెట్టినా.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఆగకుండా అమలు చేస్తున్నామని మంత్రి హరీశ్​రావు అన్నారు.  రాష్ట్రానికి న్యాయంగా రావల్సిన రూ.30 వేల కోట్ల బకాయిలను విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని విపంచి ఆడిటోరియంలో ఎస్టీయూ వజ్రోత్సవ వేడుకలకు ఆయన చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు తమ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని పక్క రాష్ట్రాల ఎమ్మెల్యే లు అసెంబ్లీలో అడుగుతున్నారని తెలిపారు. ఐదేళ్లలో 73 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బడ్జెట్‌‌‌‌లో 12 శాతం నిధులు విద్య కోసం ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. 75 ఏండ్లుగా 5 మెడికల్ కళాశాలలు ఉంటే, ఏడేండ్లలో తెలంగాణలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఈహెచ్ఎస్ పథకం అమలు అంశాన్ని  సీఎం దృష్టికి తీసుకెళ్తానని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. టీచర్ల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కషంగా వ్యవహరిస్తోందన్నారు. అనంతరం పట్టణంలోని 21, 23, 24 వార్డులలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ప్రారంభించారు. ఆయన వెంట అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ ముజామ్మిల్‌‌‌‌ ఖాన్‌‌‌‌, డీఎం అండ్‌‌‌‌ హెచ్‌‌‌‌వో డాక్టర్‌‌‌‌ కాశీనాథ్‌‌‌‌, ఎస్టీయూ రాష్ట్ర నాయకులు భూజంగరావు, సదానందంగౌడ్, పర్వతరెడ్డి, సురేందర్ రెడ్డి, రంగారావు, పట్నం భూపాల్, శ్రీధర్, రాజేశం, రాములు, టీఆర్ఎస్ నాయకులు కడవేర్గు రాజనర్సు, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, కొండం, సంపత్ రెడ్డి పాల్గొన్నారు.

పెండింగ్ వర్క్స్​కంప్లీట్ ​చేయండి

గ్రామాలలో పెండింగ్ ​పనులన్నీ అధికారుల సమన్వయంతో పూర్తి చేయించాలని ఆయా గ్రామ సర్పంచులకు మంత్రి హరీశ్ రావు సూచించారు. గురువారం ఆయన క్యాంపు ఆఫీస్ లో నారాయణరావుపేట మండల ప్రగతి, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై డివిజన్, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న మండలమైన నారాయణరావుపేటలోని  ఆయా గ్రామ సర్పంచులంతా టీమ్ లీడర్ గా వ్యవహరించి అసంపూర్తి పనులపై అధికారులు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులతో చర్చించాలని సూచించారు. గ్రామాల వారీగా అభివృద్ధి పనులకు సంబంధించి  ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయా శాఖాధికారులకు సూచించారు. 

మమ్మల్ని బలి చేయకండి
సర్పంచుల ఆవేదన

పుల్కల్, వెలుగు :  ప్రభుత్వం చేపడుతున్న పనులు పైసలు లేకున్నా ఆఫీసర్లు ఒత్తిడితో కంప్లీట్​ చేసి  నెలలు గడుస్తున్నా బిల్లులు  ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, ఆ ధోరణితో సర్పంచులను బలి చేయొద్దని సింగూర్ సర్పంచ్ రాజాగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మండల సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ చైతన్య విజయ్ భాస్కర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి హాజరయ్యారు. పలు సమస్యలపై చర్చించారు. వైకుంఠ ధామలకు విద్యుత్ సమస్యలను పరిష్కరించా‌‌‌‌ని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బక్కరెడ్డిగారి కిష్టారెడ్డి కోరారు. సింగూర్ కాల్వలలో ముళ్ల కంపను తొలగించాలని ఎంపీటీసీ సభ్యుడు దిగోల దుర్గయ్య అధికారుల దృష్టికి తెచ్చారు. 

ఆఫీసర్లపై ఎంపీపీ ఆగ్రహం 

కంగ్టి, వెలుగు:  స్థానిక ఎంపీపీ మీటింగ్​ హాల్​లో గురువారం జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో ఎంపీపీ సంగీత వెంకట్ రెడ్డి ఆఫీసర్లపై మండిపడ్డారు. బతుకమ్మ చీరలను మోడీ చీరలు అని, కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని డీలర్లు ప్రచారం చేస్తున్నారని జమ్గి(కే)ఎంపీటీసీ తెలిపారు.  ఈ విషయంలో ఎంపీపీ ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలలో పలు సమస్యలపై ప్రజ ప్రతినిధులు, ఆఫీసర్లల పనితీరుపై మండిపడ్డారు. ఆయా గ్రామాల సర్పంచులు పలు సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చారు.

అవార్డులు తీసుకునేలా పని చేయాలి 

సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట ఎంపీడీవో ఆఫీస్ లో అర్బన్ మండల సర్వసభ్య సమావేశాన్ని గురువారం నిర్వహించారు. పలు శాఖల అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సవితా ప్రవీణ్ రెడ్డి, ఎంపీడీవో సమ్మిరెడ్డి  మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు అవార్డు తీసుకునేలా గ్రామపంచాయతీలలో అభివృద్ధికి కృషి చేయాలన్నారు. గ్రామాల్లో బతుకమ్మ సంబరాలకు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యత తీసుకొని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.