పోచారం భాస్కర్​రెడ్డికి పదవీ గండం?

పోచారం భాస్కర్​రెడ్డికి  పదవీ గండం?
  • డీసీసీబీ వైస్ ​చైర్మన్ ​రమేశ్​రెడ్డి నేతృత్వంలో అవిశ్వాసానికి ప్రయత్నాలు
  • నో కాన్ఫిడెన్స్​ లెటర్​ ఇచ్చి టూర్​కి వెళ్లిన 15 మంది డైరెక్టర్లు
  • పదవి పోవడం ఖాయమవడంతో ముందే రిజైన్ చేసే యోచనలో డీసీసీబీ చైర్మన్​ 


నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్  పోచారం భాస్కర్​రెడ్డికి పదవీ గండం ఏర్పడింది. మెజార్టీ డైరెక్టర్లు ఆయనపై అవిశ్వాసం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తన పదవికి ముందే రిజైన్​ చేయడానికి సిద్ధమైనట్లు తెలిసింది.15 మంది డైరెక్టర్లు డీసీఓ శ్రీనివాస్​కు నో కాన్ఫిడెన్స్​ లెటర్​ ఇచ్చి, వైస్​చైర్మన్​ రమేశ్​రెడ్డి నేతృత్వంలో టూర్​కు వెళ్లారు. 

మెజార్టీ డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం మేరకు కలెక్టర్ ​రాజీవ్​గాంధీ హన్మంతు ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మీటింగ్ ​జరిగితే ఎలాగూ పదవి పోతుందని గ్రహించిన భాస్కర్​రెడ్డి ముందే రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఆయన వర్గానికి చెందినవారు మీడియాకు లీకులు ఇవ్వడంతో మంగళవారం సాయంత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరలైంది.

తండ్రి పలుకుబడితో చైర్మన్​ గిరీ..

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలోని143 పీఏసీఎస్​లు, 63 కోఆపరేటివ్ ​బ్యాంక్ ​బ్రాంచ్​లు ఉన్నాయి. వీటికి పోచారం భాస్కర్​రెడ్డి చైర్మన్​గా వ్యవహరిస్తున్నారు. ఐదుగురు ఎక్స్​అఫీషియో సభ్యులతో  కలిపి మొత్తం 25 మంది డైరెక్టర్లు ఉంటారు. అయితే సింగిల్​విండోల నుంచి ఎన్నికైన 20 మంది డైరెక్టర్లకు మాత్రమే చైర్మన్​ను ఎన్నుకునే, విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. ఇలా ఎన్నికైన 20 మంది డైరెక్టర్లు బీఆర్ఎస్​కు చెందినవారే. 

గత ప్రభుత్వ హయాంలో స్పీకర్​గా పనిచేసిన పోచారం శ్రీనివాస్​రెడ్డి తన పలుకుబడితో తనయుడు పోచారం భాస్కర్​రెడ్డికి చైర్మన్​ పదవి ఇప్పించారు. భాస్కర్​రెడ్డి బాన్సువాడ మండలంలోని దేశాయ్​పేట సింగిల్​విండోకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి ప్రధాన అనుచరుడైన వేల్పూర్​ సింగిల్​ విండో చైర్మన్​ కుంట రమేశ్​రెడ్డి పదవిని ఆశించిగా వైస్​ చైర్మన్ పోస్ట్​తోనే  సర్దిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎమ్మెల్సీ కవిత అండతో బోధన్​కు చెందిన గిర్దావర్​గంగారెడ్డి కూడా చైర్మన్​ కుర్చీ కోసం ఆఖరు నిమిషం వరకు విఫలయత్నం చేశారు. కానీ భాస్కర్​రెడ్డికే పదవి దక్కింది.

మొదటి నుంచి డైరెక్టర్ల కినుక..

డీసీసీబీ చైర్మన్​గా భాస్కర్​రెడ్డి పాలకవర్గం మీటింగ్​లకు తప్పితే ఆఫీస్​కు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఫైల్స్​​హైదరాబాద్​కే తెప్పించుకొని సంతకాలు చేసేవారు. డైరెక్టర్లు ఆయన తీరుపై మొదటి అసంతృప్తిగా ఉన్నారు. అయితే పార్టీ అధికారంలో ఉన్నందున నోరు మెదపలేదు. ఇప్పుడు పరిస్థితి మారడంతో వైస్​చైర్మన్ రమేశ్​రెడ్డి నాయకత్వంలో 15 మంది డైరెక్టర్లు అవిశ్వాసానికి లేఖ అందించారు. 

Also Read: సీ5 కాంట్రాక్టర్​ కేసీఆర్‌‌కే కనిపిస్తడు.. పనుల ​పేరుతో ఇసుక అమ్ముకున్న కాంట్రాక్టర్లు

నో కాన్ఫిడెన్స్​ నెగ్గాలంటే 20 మంది డైరెక్టర్లలో 11 మంది మద్దతు అవసరం. వారి మద్దతు పొందడం సాధ్యం కాదని తేలడంతో చైర్మన్​ తన పదవికి రాజీనామా చేయాలని యోచిస్తున్నారు. అవిశ్వాసం ద్వారా పదవిని కోల్పోవడం కంటే ముందే తప్పుకోవడం మంచిదని ఈ  నిర్ణయానికి వచ్చారు. చైర్మన్​ పోస్ట్​ ఆశిస్తున్న రమేశ్​రెడ్డికి కాంగ్రెస్​లీ డర్ల మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.