జోషిమఠ్లో కొనసాగుతున్న టెన్షన్..863 భవనాలకు పగుళ్లు

జోషిమఠ్లో కొనసాగుతున్న టెన్షన్..863 భవనాలకు పగుళ్లు

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని చమోలీ జిల్లా జోషిమఠ్‌లో టెన్షన్ కొనసాగుతోంది. జోషిమఠ్లో ఇంత వరకు 863 భవనాలకు పగుళ్లు ఏర్పడాయని జోషిమఠ్ జిల్లా మేజిస్ట్రేట్ హిమాన్షు ఖురానా వెల్లడించారు. ఈ భవనాల్లో 181 సురక్షితం కాదని తెలిపారు. జోషిమఠ్లో భూమి కుంగిపోవడం వల్లనే పగుళ్లు ఏర్పడుతున్నాయని ప్రకటించారు. ఢాకా గ్రామంలో కుంగిపోయిన ప్రాంతాలను పలువరు అధికారులతో కలిసి జిల్లా మేజిస్ట్రేట్ హిమాన్షు ఖురానా పరిశీలించారు. జోషిమఠ్  కాంటూర్ మ్యాప్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా మేజిస్ట్రేట్ ఆర్‌డబ్ల్యుడీని ఆదేశించారు. స్థానిక ప్రజల సలహాల తర్వాతే ..వారిని తరలించే ప్రక్రియ చేపట్టాలన్నారు. 

మంచు కురవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో శుక్రవారం కూల్చివేత నిలిపివేసిన అధికారులు శనివారం కూల్చివేతలను ప్రారంభించారు. వాతావరణం అనుకూలించడంతో  భవనాల కూల్చివేత పనులను కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే  మంచు కురుస్తుండడం వల్ల తాత్కాలిక సహాయ శిబిరాల్లో నివసిస్తున్న ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 

మరోవైపు ఉత్తరాఖండ్లో అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికలే జోషిమఠ్‌ కుంగిపోవడానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్రోని క్యాపిటలిజం కారణంగానే జోషిమఠ్‌ విపత్తు సంభవించిందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇస్రో యొక్క నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ విడుదల చేసిన చిత్రాల ప్రకారం 2022 డిసెంబర్‌ 27 నుంచి 2023 జనవరి 7 మధ్య 12 రోజుల్లో దాదాపు 5.4 సెం.మీ వేగవంతమైన క్షీణత జోషిమఠ్‌లో కనిపించింది. అటు జోషిమఠ్‌ కుంగిపోవడానికి కారణం..ఈ ప్రాంత సమీపంలోని జరుగుతున్న NTPC సొరంగ నిర్మాణ సమయంలో చేస్తున్న పేలుళ్లే కారణమని మరికొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.  జోషిమఠ్‌ కుంగుబాటుకు అనేక జలవిద్యుత్‌ ప్రాజెక్టులు, భారీ హోటళ్లు, రోడ్డునిర్మాణ ప్రాజెక్టులే కారణంగా నిపుణులు చెబుతున్నారు.