
న్యూఢిల్లీ: ఇండియా స్క్వాష్ ప్లేయర్ జోష్న చినప్ప.. జపాన్ ఓపెన్ పీఎస్‌ఏ చాలెంజర్ ఈవెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. జపాన్‌లోని యెకహామాలో ఆదివారం జరిగిన విమెన్స్ సింగిల్స్ సెమీస్‌లో వరల్డ్ పదో ర్యాంకర్ జోష్న 11–7, 11–1, 11–5తో నాలుగోసీడ్ రానా ఇస్మాయిల్ (ఈజిప్ట్)పై గెలిచింది. ఆరంభం నుంచే మెరుగ్గా ఆడిన ఇండియన్ ప్లేయర్ వరుస పాయింట్లతో హోరెత్తించింది. రెండో గేమ్‌లో ప్రత్యర్థికి కనీసం పుంజుకునే అవకాశం కూడా ఇవ్వలేదు.
బలమైన షాట్లతో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేసింది. అంతకుముందు జరిగిన క్వార్టర్‌ఫైనల్లో జోష్న 11–8, 15–13, 11–9తో నార్డిన్ గారస్ (ఈజిప్ట్)పై గెలిచింది. తొలి రౌండ్‌లో జోష్న 11–6, 11–6, 11–6తో అన్రీ గోహ్ (మలేసియా)పై, ప్రిక్వార్టర్స్‌లో 11–7, 11–4, 11–9తో లారెన్ బాల్టయన్ (ఫ్రాన్స్)ను ఓడించింది. సోమవారం జరిగే ఫైనల్లో జోష్న.. మూడో సీడ్ హయా అలీ (ఈజిప్ట్)తో తలపడుతుంది.