జర్నలిస్టు సౌమ్య హత్య కేసు.. 15 ఏళ్లు పోరాడి గెలిచిన తండ్రి మృతి

జర్నలిస్టు సౌమ్య హత్య కేసు.. 15 ఏళ్లు పోరాడి గెలిచిన తండ్రి మృతి

కూతురును చంపిన కేసులో నిందితులకు శిక్ష పడేందుకు ఆ తండ్రి ఎంతో పోరాటం చేశాడు.. వృద్దాప్య సమస్యలు వెంటాడుతున్నా పట్టించుకోలేదు.. తన కూతురు ప్రాణాలు తీసిన నిందితులకు శిక్ష పడే వరకూ అలిసిపోలేదు. కోర్టు శిక్ష విధించిన తర్వాత ఆ తండ్రి కన్నుమూశారు. 

అసలేం జరిగింది..? 

ఎంకే విశ్వనాథన్, మాధవి అనే దంపతుల కూతురు సౌమ్య. 26 ఏళ్ల సౌమ్య ఢిల్లీలోని ఇండియా టుడే గ్రూపులో జర్నలిస్టుగా పని చేస్తుండేవారు. 2008 సెప్టెంబర్‌ 30న విధులు ముగించుకుని కారులో సౌమ్య ఇంటికి వెళ్తుండగా నలుగురు దుండగులు ఆమెను తుపాకీతో కాల్చి చంపారు. దక్షిణ ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్ లో ఈ హత్య జరిగింది. అప్పట్లో ఇది సంచలనం రేపింది. ఈ కేసు విచారణ దాదాపు15 ఏళ్ల పాటు నడిచింది. 

నిందితులను దోషులుగా నిరూపించడం కోసం జర్నలిస్టు సౌమ్య తండ్రి విశ్వనాథన్‌ తీవ్రంగా కృషి చేశారు. తాను అరవై ఏళ్ల వయసులో కూతురు హత్యకు గురికావడంతో ఆమెను చంపిన వారికి శిక్ష పడేందుకు 15 ఏళ్లు ప్రతిరోజు శ్రమించాడు. 15 ఏళ్ల పాటు రోజు పొద్దున్నే లేచి కూతురు హత్య కేసు ఫాలోఅప్‌ చేసేవారు. ఎక్కడా అధైర్యపడలేదు. నిరాశ చెందకుండా పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ పట్టు వదలని విక్రమార్కుడిలా తిరిగాడు. 

రెండు వారాల క్రితమే కోర్టు నలుగురు నిందితులకు శిక్ష విధించింది. 2023,  నవంబర్‌ లో తన కూతురును చంపిన నలుగురు దోషులకు యావజ్జీవ శిక్ష వేసింది న్యాయస్థానం. నిందితులు రవి కపూర్, అమిత్ శుక్లా, అజయ్ కుమార్, బల్జీత్ మాలిక్, అజయ్ సేథీలను అక్టోబర్ 18న కోర్టు దోషులుగా నిర్ధారించింది. చోరీ చేయాలనే ఉద్దేశంతోనే సౌమ్యను చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. విషాదమేంటంటే కూతురు 41వ జయంతికి ముందు రోజు శనివారం 82 ఏళ్లు ఉన్న సౌమ్య తండ్రి కన్ను మూయడం పలువురి హృదయాలను కలిచివేస్తోంది.