ప్రాంతీయ పార్టీలతో పత్రికా స్వేచ్ఛ లేదు

ప్రాంతీయ పార్టీలతో పత్రికా స్వేచ్ఛ లేదు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వాలు కాలరాస్తే వారికి అండగా నిలవాల్సింది జర్నలిస్టులేనని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె. లక్ష్మణ్‌‌‌‌ అన్నారు. రాష్ట్ర ప్రజలు యూపీ మోడల్‌‌‌‌ పాలన కోరుకుంటున్నారని తెలిపారు. వెస్ట్‌‌‌‌ మారేడ్‌‌‌‌పల్లిలోని పద్మశాలి భవన్‌‌‌‌లో నిర్వహించిన ఇండియన్‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ జర్నలిస్ట్స్‌‌‌‌ 74వ జాతీయ కౌన్సిల్‌‌‌‌ సమావేశాల్లో శుక్రవారం ఆయన పాల్గొని మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలందరి ఆకాంక్షలు నెరవేర్చడానికి మళ్లీ ఉద్యమానికి సిద్ధం కావాల్సి ఉందన్నారు. 

ప్రాంతీయ పార్టీలతో పత్రికా స్వేచ్ఛ లేదు: ఈటల

ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో పత్రికా స్వేచ్ఛ లేదని, నియంతృత్వ ధోరణి నడుస్తోందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌‌‌‌ అన్నారు. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు షోయబుల్లాఖాన్‌‌‌‌ను హత్య చేశారని, ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న సర్కారు.. మీడియాను కంట్రోల్ చేస్తోందని అన్నారు. జర్నలిస్టులందరూ షోయబుల్లాఖాన్‌‌‌‌ వారసులుగా ప్రజల కోసం పని చేయాలని ఆయన  సూచించారు. మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌‌‌‌ రావు మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టులను వేధిస్తోందని అన్నారు. అన్ని హాస్పిటళ్లలో చెల్లుబాటయ్యేలా జర్నలిస్టులకు హెల్త్‌‌‌‌ కార్డులు ఇవ్వాలని, వాళ్ల పిల్లలకు ఉచిత విద్య, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌‌‌‌డబ్ల్యూజే నేషనల్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ మెంబర్‌‌‌‌గా సీనియర్‌‌‌‌ జర్నలిస్టు కపిలవాయి రవీందర్‌‌‌‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐఎఫ్‌‌‌‌డబ్ల్యూజే జాతీయాధ్యక్షుడు మల్లికార్జునయ్య, టీజేయూ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు, కార్యదర్శి స్వామి, నాయకులు భరత్‌‌‌‌, శ్రీనివాస్‌‌‌‌, సుదర్శన్‌‌‌‌, జర్నలిస్టులు పాల్గొన్నారు.