
- కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీ విధివిధానాలపై చర్చిద్దాం
వైరా, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర కూడా కీలకమని, అది మర్చిపోమని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జర్నలిస్టుల న్యాయపరమైన కోరికలు తీర్చడానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుందని తెలిపారు. ఖమ్మం జిల్లా వైరాలోని శబరి గార్డెన్స్ లో గురువారం జరిగిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ)4వ జిల్లా మహాసభకు మంత్రి పొంగులేటి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత పదేండ్ల ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను, అక్రమాలను, వాస్తవాలను వెలికితీయడంలో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు పడ్డ బాధలు తనకు తెలుసన్నారు.
జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కేటాయింపు అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉందన్నారు. దానిపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నామన్నారు. కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీ విధివిధానాలపై సోమ, మంగళవారాల్లో చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు. జర్నలిస్టుల న్యాయమైన కోరికలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుంటారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రజా సమస్యలపై జర్నలిస్టులు రాస్తున్న వార్తలతో పరిష్కారమవుతున్నాయన్నారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నేతలు పాల్గొన్నారు.