ఇండియాలో మెగా GCC ఏర్పాటు చేస్తున్న జేపీ మోర్గన్.. బ్యాక్ ఆఫీస్ కాదు టెక్ పవర్ హబ్

ఇండియాలో మెగా GCC ఏర్పాటు చేస్తున్న జేపీ మోర్గన్.. బ్యాక్ ఆఫీస్ కాదు టెక్ పవర్ హబ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హెచ్1బి వీసాల ఫీజు పెంపు నుంచి కఠిన ఇమ్మిగ్రేషన్ పాలసీ వలకు తీసుకున్న నిర్ణయాలతో అమెరికాలోని దిగ్గజ బ్యాంకింగ్, టెక్ కంపెనీలు తమ రూట్ మార్చేశాయి. ఉద్యోగులను ఆఫ్ షోర్ కంట్రీల్లోనే తమ కోసం పనిచేసేందుకు వీలుగా కొత్త ఆఫీసులతో పాటు గ్లోబల్ కెపాసిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తూ తమ పనికి ఇబ్బంది కలగ కుండా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. 

ఈ క్రమంలోనే తాజాగా అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గన్ కూడా ఇదే దారిని ఎంచుకుంది. ఇందులో భాగంగా ముంబైలోని పవాయ్ ప్రాంతం త్వరలో ఆసియాలోనే అతిపెద్ద బ్యాంకింగ్ హబ్‌గా అవతరించబోతోంది. ఎందుకంటే జేపీ మోర్గాన్ (JP Morgan) భారత్‌లో తన కార్యకలాపాలను భారీగా విస్తరిస్తూ.. ముంబైలో ఒక భారీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(GCC) ఏర్పాటుకు సిద్ధమైంది. ఇందుకోసం జేపీ మోర్గాన్ ముంబైలోని పవాయ్ ప్రాంతంలో సుమారు 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక భారీ కార్యాలయాన్ని లీజుకు తీసుకుంది. ఇది 2029 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఆసియా ఖండంలోనే ఒకే సంస్థ నిర్వహిస్తున్న అతిపెద్ద జీసీసీగా ఇది రికార్డు సృష్టించనుంది.


జేపీ మోర్గన్ తన భారీ సెంటర్‌లో సుమారు 30,000 మంది ఉద్యోగులు ఒకేసారి పనిచేసే విధంగా రూపొందిస్తోంది. ఇది కేవలం ఆఫీసు మాత్రమే కాదని.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధునాతన సాంకేతిక విభాగాలకు కేంద్ర బిందువుగా మారనుందని బ్యాంకింగ్ దిగ్గజం వెల్లడించింది. ఈ భారీ ప్రాజెక్టును రియల్ ఎస్టేట్ దిగ్గజం 'నిరంజన్ హిరానందని గ్రూప్' నిర్మిస్తోంది.

అయితే ఇప్పుడు చాలా మందికి ఉన్న అనుమానం అసలు ఇండియాలోని ఇంత పెద్ద జీసీసీ ఏర్పాటు నిర్ణయం ఎందుకు అన్నదే. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న జేపీ మోర్గాన్ ఉద్యోగుల్లో దాదాపు మూడో వంతు మంది భారత్‌లోనే ఉన్నారు. బెంగళూరు, హైదరాబాద్ తర్వాత ముంబైని ఎంచుకోవడం ద్వారా భారత్‌లో ఉన్న నైపుణ్యం కలిగిన నిపుణులను లేదా వనరులను మరింత సమర్థవంతంగా వాడుకోవాలని సంస్థ భావిస్తోంది. తాజా నిర్ణయంతో భారత్ ఇప్పుడు కేవలం బ్యాక్-ఆఫీస్ పనులకు మాత్రమే పరిమితం కాలేదని, గ్లోబల్ బ్యాంకింగ్ కార్యకలాపాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే 'ఇన్నోవేషన్ హబ్'గా మారుతోందని వెల్లడైంది. దీనికి తోడు ఇప్పటికే టెక్ కంపెనీలకు కేంద్రంగా ఉన్న ముంబై పవాయ్ ప్రాంతం రియల్టీ బూమ్ ఈ కేంద్రం పెంచనుంది. అలాగే ఆ ప్రాంతం గ్లోబల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌గా మారిపోనుంది.