గ్రామాలకు వెళ్లి.. ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేయండి : నడ్డా

గ్రామాలకు వెళ్లి.. ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేయండి : నడ్డా

హైదరాబాద్ : పార్టీ ముఖ్యనేతలు గ్రామాలకు వెళ్లి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఇవాళ ఘట్ కేసర్ లో జరిగిన స్టేట్ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య​ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మోదీ నేతృత్వంలో దేశం అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా 80 కోట్ల మందికి గరీబ్ కల్యాణ్​ యోజన కింద ఉచితంగా రేషన్ సరఫరా చేస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కిందన్నారు.  

ఇందులో తెలంగాణకు చెందిన  రెండు కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారన్నారు. ఐఎంఎఫ్​ నివేదిక ప్రకారం భారత్ లో 13 కోట్ల మంది పేదరికాన్ని జయించారని  వివరించారు. ఎన్నో ఏళ్లుగా దేశాన్నిపాలించిన కాంగ్రెస్ పార్టీతో అది సాధ్యం కాదేలని అన్నారు. ప్రధాని అవాస్ యోజన కింద దేశంలో నాలుగు  కోట్ల ఇండ్లను కేంద్రం నిర్మించిందని చెప్పారు. కేసీఆర్ తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించిందా..? అని ప్రశ్నించారు.  తెలంగాణలో బీజేపీ గెలవాలి .. దాంతో పాటు  మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి తేవాలని ఆయన సూచించారు.

రెండు రోజుల వ్యవధిలో 20 వేల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే అభివృద్ధి కూడా వేగవంతంగా సాగుతుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలని విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ను గద్దె దించడం ద్వారానే అవినీతికి అడ్డుకట్ట వేయొచ్చని పేర్కొన్నారు.