అంబేద్కర్ బాటలోనే బీజేపీ పయనిస్తోంది: జేపీ నడ్డా

 అంబేద్కర్ బాటలోనే  బీజేపీ పయనిస్తోంది: జేపీ నడ్డా

రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ బాటలోనే బీజేపీ పయనిస్తోందన్నారు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఏప్రీల్ 14వ తేదీ ఆదివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సంకల్స్ పత్ర పేరుతో బీజేపీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్ తోపాటు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. దేశం కోసం, పార్టీ కోసం  మోదీ సమయం కేటాయిస్తున్నారని.. ఆయన నేతృత్వంలో దేశంలో అభివృద్ధి పథంలో పయనిస్తోందని చెప్పారు. దేశంలో మా ప్రభుత్వం హయాంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నారు. సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ కృషి చేశారని.. సామాజిక న్యాయమే లక్ష్యంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని  రూపొందించారన్నారు నడ్డా.   అధికారంలో ఉన్నా లేకున్నా సామాజక న్యాయం కోసం బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు. 

దేశంలో 4 కోట్ల మందికి పక్కా ఇండ్లు నిర్మించామన్నారు.  వచ్చే ఐదేళ్లు దేశానికి ఎలా సేవ చేయాలన్నది మేనిఫెస్టోలో ఉంటుందని తెలిపారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 3 లక్షల కిలో మీటర్ల గ్రామీణ రహదారులు నిర్మించామని ఆయన చెప్పారు. ఏం చెప్పామో అదే అమలు చేశామన్న నడ్డా... జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేస్తామన్నాం.. చేశామని చెప్పారు. అయోధ్యలో రామమందిరం కల సాకారం చేశామని తెలిపారు.
ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లీం మహిళలకు న్యాయం చేశామని నడ్డా చెప్పారు.