
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. జాన్వీకపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. మూవీ షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఈరోజు నుంచి శంషాబాద్‌లో కొత్త షెడ్యూల్ మొదలవుతోంది. సినిమాకెంతో కీలకమైన యాక్షన్ సీన్స్‌ను అక్కడ చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఎక్కువగా యాక్షన్ సీన్స్‌నే తెరకెక్కిస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడం, యాక్షన్ సీన్స్‌లో విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎక్కువగా ఉండడంతో ముందుగా వాటిని పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు 250 రోజుల్లో సినిమా విడుదల కాబోతోందంటూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు.
ఇందులో కొరటాల మాట్లాడుతూ ‘ఈ కథలో మనుషుల కంటే ఎక్కువగా మృగాలు ఉంటాయి. వాళ్లకు దేవుడు, చావు అంటే భయం లేదు. ఒకే ఒక్కటంటే భయం. ఆ భయం ఉండాలి.. అవసరం’ అంటూ ‘దేవర’ పాత్రపై హైప్ పెంచారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా విడుదల కానుంది.