కేసులు, శిక్షల గురించి భయమే లేదు

కేసులు, శిక్షల గురించి భయమే లేదు
  • జూబ్లీహిల్స్​ గ్యాంగ్​రేప్​ కేసుపై పోలీసుల విచారణలో మైనర్ల తీరిది
  • ముగ్గురి కస్టడీ పూర్తి.. ఇవాళ మిగతా ఇద్దరిదీ కూడా 
  • 17 మంది సాక్షుల్లో 8 మందిని విచారించిన పోలీసులు
  • కార్ల ఓనర్లు, నిందితుల పేరెంట్స్​పై కేసులు

హైదరాబాద్, వెలుగు: కేసులు, శిక్షల గురించి భయమే లేదు.. తప్పు చేశామన్న బాధే లేదు.. పైగా ఎంజాయ్​మెంట్​ కోసమే బాలికను ట్రాప్​ చేశామన్న సమాధానం. ఇద్దరమ్మాయిలను ట్రాప్​ చేసినా.. ఒక్కరినే కార్​లో తీసుకెళ్లామన్న నిర్లక్ష్యపు ఆన్సర్​.. రొటీన్​ జాయ్​లో భాగంగానే బాలికపై విచక్షణారహితంగా ప్రవర్తించామన్న సమాధానం.. ఇదీ ఐదు రోజుల పోలీస్​ కస్టడీలో మైనర్​ నిందితుల తీరు. పోలీస్ ​స్టేషన్​లో వాళ్ల ప్రవర్తనను చూసి పోలీసులే విస్మయానికి గురైనట్టు తెలుస్తోంది. విచారణ చేస్తున్నంతసేపూ వాళ్లలో పశ్చాత్తాపమే కనిపించలేదని విచారణ చేస్తున్న ఓ అధికారి చెప్పారు. ఎంజాయ్​మెంట్ మోజులోనే అమ్మాయిపై ఘాతుకానికి పాల్పడినట్టు మైనర్​ నిందితులు చెప్పారన్నారు. పోలీస్​ కస్టడీలో భాగంగా మంగళవారం కూడా మైనర్లను పోలీసులు విచారించారు. మంగళవారంతో ముగ్గురి కస్టడీ పూర్తికాగా.. ఎమ్మెల్యే కొడుకు సహా ఇంకో మైనర్​ కస్టడీ బుధవారంతో ముగియనుంది.   

పూర్తి వివరాలు రికార్డ్​

ఘటనకు సంబంధించిన వీడియోలను ఫ్రెండ్స్​కు షేర్​ చేసిన విషయంపై పోలీసులకు క్లారిటీ వచ్చింది. బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు, ఫొటోలను ఎవరెవరికి పంపించారన్న వివరాలను వారి నుంచి రాబట్టారు. 17 మంది సాక్షుల్లో 8 మంది నుంచి స్టేట్​మెంట్స్​ తీసుకున్నారు. బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రులు, పబ్​ నిర్వాహకులు, బాధితురాలి ముగ్గురు స్నేహితులు సాక్షులుగా ఉన్నట్టు తెలుస్తోంది. బెంజ్​, ఇన్నోవా కార్ల వివరాలు సహా అమ్నీషియా పబ్​ నుంచి అత్యాచారం వరకు జరిగిన ఘటనల వివరాలను సాదుద్దీన్​ సహా నిందితుల నుంచి తీసుకున్నారు. బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో, ఫొటోలు బయట పడటం వల్లే తాము దొరికామని, లేదంటే దొరికేవాళ్లమే కాదని నిందితులు చెప్పినట్టు తెలుస్తోంది. మైనర్​కు ఎమ్మెల్యే కుమార్తె బెంజ్​కారు ఇచ్చినట్టు విచారణలో తెలినట్లు, దీంతో ఆమెపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్​కు కారు ఇచ్చినందుకు వారి కుటుంబసభ్యులపైనా కేసులు పెట్టారు. బెంజ్​కారు, ఇన్నోవా పోలీసులకు దొరక్కుండా సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రయత్నం చేసినట్టు సమాచారం. వక్ఫ్​ బోర్డ్​ చైర్మన్​కు ప్రభుత్వం ఎలాంటి వాహనాన్ని కేటాయించలేదని పోలీసులు తేల్చారు. తన సొంత కారుకే గవర్నమెంట్​ స్టిక్కర్​ వేసుకున్నట్టు నిర్ధారించారు. ఇన్నోవా డ్రైవర్​ స్టేట్​మెంట్​నూ రికార్డ్​ చేసిన పోలీసులు.. ఘటన జరిగిన రోజు ఎవరెవరూ ప్రయాణించారన్న విషయాలను రాబట్టారు.  

నిందితులు చెప్పిన వివరాలతో రిపోర్ట్​

బెంజ్​ కారు, ఇన్నోవాలో స్వాధీనం చేసుకున్న సాక్ష్యాధారాలు, వేలి ముద్రలు, 24 రకాల నమూనాలను పరీక్షించేందుకు ఇప్పటికే ఫోరెన్సిక్​ సైన్స్​ లేబొరేటరీకి పోలీసులు పంపించారు. నిందితుల కస్టడీలో భాగంగా సేకరించిన వివరాలతో తయారు చేసిన రిపోర్టును జువనైల్​ జస్టిస్​ బోర్డు, సిటీ పోలీస్​ కమిషనర్​కు అందించనున్నారు. ఆ రిపోర్టును సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్​ టీమ్​ పరిశీలించనుంది. ఫాస్ట్​ట్రాక్​ కోర్టులో చార్జిషీటు, బాధితురాలికి న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఓ అధికారి తెలిపారు.