క్యాపిటిల్  హౌస్‌‌‌‌‌‌‌‌పై దాడి కేసులో ట్రంప్‌‌‌‌‌‌‌‌కు ఎదురుదెబ్బ

క్యాపిటిల్  హౌస్‌‌‌‌‌‌‌‌పై దాడి కేసులో ట్రంప్‌‌‌‌‌‌‌‌కు ఎదురుదెబ్బ

 వాషింగ్టన్ :  క్యాపిటల్ హౌస్‌‌‌‌‌‌‌‌పైకి అల్లరి మూకను ప్రేరేపించారనే కేసును కొట్టివేయాలని కోరుతూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విజ్ఞప్తిని యూఎస్ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తిరస్కరించింది. యూఎస్ క్యాపిటల్ అల్లర్ల విషయంలో ట్రంప్‌‌‌‌‌‌‌‌పై దాఖలైన పిటిషన్లపై ముందుకు వెళ్లాలని, ఆయన విచారణను ఎదుర్కోవాల్సిందేనని తీర్పు చెప్పింది. డెమోక్రటిక్ చట్ట సభ్యులు, పోలీసు అధికారులు వేసిన పిటిషన్ల నుంచి ప్రెసిడెన్షియల్ ఇమ్యూనిటీ తనను కాపాడుతుందంటూ ట్రంప్ తరఫు న్యాయవాదులు వాదించారు. క్యాపిటల్‌‌‌‌‌‌‌‌పై దాడికి ముందు ర్యాలీలో ట్రంప్ చేసిన ప్రసంగంలో ప్రజా ఆందోళనకు సంబంధించిన విషయాలను ప్రస్తావించారని, ఇవి ప్రెసిడెన్షియల్ ఇమ్యూనిటీ పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు. అయితే ఈ వాదనలను కోర్టు కొట్టివేసింది. ఎన్నికల్లో జోక్యం కేసులో ప్రాసిక్యూషన్ నుంచి ఆయన తప్పించుకోలేరని జడ్జి తన్యా చుత్‌‌‌‌‌‌‌‌కన్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ‘‘మాజీ అధ్యక్షుడి హోదాలో ఎలాంటి ఇమ్యూనిటీ ఉండదు. ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందే. పదవిలో ఉన్నప్పుడు మాత్రమే దర్యాప్తు, నేరారోపణ, విచారణ, అభియోగాల నమోదు, దోషి, ఏదైనా నేరపూరిత చర్యలకు సంబంధించి శిక్ష విధించే విషయంలో మినహాయింపు ఉంటుంది” అని స్పష్టం చేశారు.

నిరూపించుకోండి

‘‘అధ్యక్షులు చేపట్టే అధికారిక విధులకు సంబంధించి వారికి విస్తృత ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. అయితే ఈ పవర్ కేవలం ప్రెసిడెంట్ చేసే చర్య లేదా ప్రసంగాన్ని మాత్రమే కవర్ చేయదు. ఉదాహరణకు.. రెండో టర్మ్ కోసం పోటీ పడుతున్న ప్రస్తుత ప్రెసిడెంట్.. తన ప్రచారానికి నిధులు సమకూర్చేందుకు ఏర్పా టు చేసిన ర్యాలీలో మాట్లాడుతున్నప్పుడు లేదా ప్రైవేట్ నిధుల సమీకరణకు హాజరైనప్పుడు.. అధ్యక్ష హోదాలో అధికారిక విధులను నిర్వహించడం లేదనే అర్థం. ఆ సమయంలో ఆయన ఆఫీస్ సీకర్ మాత్రమే.. ఆఫీస్ హెల్డర్ కాదు’’ అని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ప్రెసిడెన్షియల్ ఇమ్యునిటీ విషయంపై పోరాడేందుకు ట్రంప్‌‌‌‌‌‌‌‌కు తలుపులు తెరిచే ఉంటాయని చెప్పింది. ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా అధికారిక హోదాలో చర్యలు తీసుకున్నారని నిరూపించడానికి ట్రంప్ తన పోరాడ వచ్చని సూచించింది.