తీర్పు..కోర్టుల విశ్వసనీయత పెంచేలా ఉండాలె

తీర్పు..కోర్టుల విశ్వసనీయత పెంచేలా ఉండాలె

కోర్టుల తీర్పులు, ఉత్తర్వులు సహేతుకమైన కారణాలు కలిగి ఉండాలి. వాటి ప్రతులు పార్టీలకు అందుబాటులో ఉండాలి. చట్టం నిర్దేశిస్తున్నది, రాజ్యాంగం చెబుతున్నది కూడా అదే. అయితే దేశంలో కొన్ని హైకోర్టుల తీర్పులు, ఉత్తర్వులను చూసినప్పుడు అలా లేవని అనిపిస్తోంది. దానికి కారణం ఏమిటి? న్యాయమూర్తులు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఇది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. తగిన కారణాలు చెప్పకుండా బెయిల్ ఉత్తర్వులను ముందుగానే ప్రకటిస్తున్న న్యాయమూర్తులూ ఉన్నారు. ఎలాంటి కారణాలు రాయకుండా తీర్పులను ప్రకటించడం కూడా చూస్తున్నాం. ఇలా చేస్తున్న న్యాయమూర్తులు ఎక్కువగా హైకోర్టు న్యాయమూర్తులే. ఈ విధానంపై ఎన్నో ఏండ్లుగా సుప్రీంకోర్టు హైకోర్టులను ఆదేశిస్తున్నా.. ఇంకా పాత విధానమే కొనసాగుతుండటం ఆందోళనకరం. 

30 ఏండ్లుగా చెబుతున్నా..

2020లో బాలాజీ బలరాం వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో కూడా సుప్రీంకోర్టు ఈ విషయాన్ని మళ్లీ చెప్పింది. ఒకవేళ కోర్టులు అలా ఇవ్వని పక్షంలో అతిత్వరగా సహేతుక కారణాలతో తీర్పులను, ఉత్తర్వులను జారీ చేయాలని వాటిని పార్టీలకు ఇవ్వాలని చెప్పింది. దానివల్ల ఇబ్బందులు ఎదురైనా పార్టీలు తగిన చర్యలు తీసుకోడానికి వీలవుతుందని కూడా సుప్రీం కోర్టు ఈ తీర్పులో చెప్పింది. తీర్పు ప్రతిని అన్ని రాష్ట్రాల చీఫ్ జస్టిస్ లకు పంపిస్తూ న్యాయమూర్తులకు అందజేయాలని కూడా వెల్లడించింది.  అయినా కూడా హైకోర్టు న్యాయమూర్తుల్లో ఆశించిన స్థాయిలో మార్పు రావడం లేదు. పాత పద్ధతి ఇంకా కొనసాగడంపై అలహాబాద్ హైకోర్టు తీర్పు విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంద్రజిత్ యాదవ్ వర్సెస్ సంతోష్ సింగ్ కేసులో  ముద్దాయి తనకు విధించిన శిక్షకు వ్యతిరేకంగా అప్పీలు చేసుకున్నాడు. అది హత్యా నేరం. హైకోర్టు అతని అప్పీలును 30 మార్చి 2019లో ఆమోదించింది. తగిన కారణాలు రాయకుండా ఆపరేటివ్ భాగాన్ని మాత్రమే ప్రకటించింది. జైల్లో ఉన్న ముద్దాయిని విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. దాదాపు ఐదు మాసాల తర్వాత కారణాలు వివరిస్తూ తీర్పు ప్రకటించింది.తగిన కారణాలు చెప్పి మాత్రమే తీర్పులను ప్రకటించాలని సుప్రీంకోర్టు 30 సంవత్సరాలుగా చెబుతున్నప్పటికీ హైకోర్టు ఇలా తీర్పును వెలువరించడం పట్ల సుప్రీం కోర్టు ఆశ్చర్యపోయింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ తిరిగి అప్పీలును విచారించి.. తీర్పును ప్రకటించాలని ఆదేశించింది.

సహేతుక కారణాలు లేకుండా తీర్పులను వెలువరించడానికి వీలు లేదు. అదేవిధంగా ఉత్తర్వులను కూడా చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఇలా ఎందుకు జరుగుతుందన్న ప్రశ్న తరచూ తలెత్తుతోంది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నారు కాబట్టి వారిని తొలగించడం, వారి మీద చర్యలు తీసుకోవడం అంత సులువు కాదు. అందువల్ల తీర్పులు,ఉత్తర్వులు అలా వస్తున్నాయని చాలా మంది అనుకుంటున్నారు.అంటున్నారు కూడా. ఇలాంటి ఉత్తర్వులు రాసిన హైకోర్టు తీర్పులను సుప్రీంకోర్టు తప్పుపట్టింది.  అలహాబాద్ హైకోర్టు వెలువరించిన సురేంద్ర ప్రతాప్ సింగ్ వర్సెస్ విశ్వరాజ్ సింగ్ కేసులో ఇదే జరిగింది. అలహాబాద్ హైకోర్టు 6 నవంబర్ 2019న తీర్పు వెలువరించింది. కోర్టు మొత్తం తీర్పును కాకుండా కార్య రూపభాగాన్ని(ఆపరేటివ్ పోర్షన్) మాత్రమే ప్రకటించింది. పూర్తి తీర్పును15 మార్చి 2020లో ప్రకటించింది. సరిదిద్దిన తీర్పు ప్రతి15 ఏప్రిల్ 2020 రోజున బయటకు  వచ్చింది. ఇలా ఉత్తర్వులు జారీ చేయవద్దని సుప్రీంకోర్టు చాలాసార్లు హైకోర్టులకు చెప్పింది. ఇలా చేయడం వల్ల పార్టీలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూడా పేర్కొంది. అయినా హైకోర్టులు ఈ పద్ధతి మానడం లేదు. స్టేట్ ఆఫ్ పంజాబ్, ఇతరులు జగ్ దేవ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ ఇలా ఉత్తర్వులు ఇవ్వకూడదని ప్రత్యేకంగా చెప్పింది. దాని వల్ల ఎదురయ్యే ఇబ్బందులను కూడా అందులో పేర్కొంది. అయినా తగిన కారణాలు చెప్పకుండా ఉత్తర్వులు చెప్పే పద్ధతి ఇంకా కొనసాగుతూనే ఉంది.

పిటిషన్ ​ఏదైనా..

తగిన కారణాలు రాసిన తీర్పు ప్రజలకు కోర్టుల పట్ల, న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పెంచుతుంది. అది న్యాయ పాలనలో అతి ముఖ్యమైన అంశం. ఈ న్యాయ సూత్రాలను అమలు చేయాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంటుంది. నేర విచారణ అనేది న్యాయబద్ధంగా వుండాలంటే  మూడు అంశాలు ముఖ్యమైనవి. కోర్టు వెలువరించే తీర్పు మూడు మౌలిక అంశాలను కలిగి ఉండాలి. అది ప్రజలకు, ముద్దాయికి అందుబాటులో ఉండాలి. సహేతుకమైన  కారణాలు కలిగి ఉండాలి. రాజ్యాంగబద్ధంగానూ ఉండాలి. వ్యక్తిగత ప్రెజుడీస్ లేకుండా ఉండాలి. అది సివిల్ కేసు కావచ్చు, క్రిమినల్ కేసు కావచ్చు, రిట్ పిటిషన్ కావచ్చు, బెయిల్ పిటిషన్ కావచ్చు.. కోర్టు వెలువరించే తీర్పు ఏదైనా ఈ అంశాలు కలిగి ఉండాల్సిందే. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు గల కారణాలు తీర్పులో ప్రతిబింబించాలి. అప్పుడే కోర్టుల మీద, న్యాయవ్యవస్థ మీద విశ్వసనీయత పెరుగుతుంది. తగిన కారణాలు రాసిన తీర్పులో కేసుకు సంబంధించిన -సాక్ష్యాలు, వాదనలు అన్ని విషయాలు కనిపిస్తాయి. ఎలాంటి కారణాలు చూపని తీర్పులు వెలువరించడం వల్ల కోర్టుల పట్ల నమ్మకం తగ్గుతుంది. 

ఆర్టికల్​21కి విరుద్ధం కూడా..

సహేతుకమైన కారణాలతో, నిర్ణీత కాలవ్యవధిలో తీర్పు పార్టీలకు అందేవిధంగా కోర్టు తగిన చర్యలు చేసుకోవాలి. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పార్టీలు అప్పీలు చేసుకోవడంలో ఇబ్బందులు ఉండవు. అలాగే కోర్టు తమ వాదనలను పరిగణనలోకి తీసుకున్నదా లేదా అన్న విషయం కూడా పార్టీలకు తెలుస్తుంది. కోర్టు విధించిన శిక్ష కూడా సరైన పద్ధతిలో ఉందా లేదా, నేరానికి తగినట్టుగా ఉందా లేదా అన్న విషయం కూడా తెలుస్తుంది. రాజ్యాంగబద్ధంగా తీర్పు ప్రతులు పార్టీలకు అందుబాటులో ఉండాలి. అలా లేకపోవడం ఆర్టికల్ 21కి విరుద్ధమే అవుతుంది. కోర్టు నిర్ధారించి అంశాలు తీర్పులో స్పష్టంగా ఉండాలి. కోర్టు నిర్ణయానికి తగిన కారణాలు తీర్పులో ఉన్నప్పుడు కేసు గెలిచిన పార్టీకి, ఓడిన పార్టీకి కోర్టుల మీద విశ్వసనీయత పెరుగుతుంది. 1984 నుంచి తీర్పులను సకాలంలో ప్రకటించాలని, సుప్రీం కోర్టు చెబుతున్నప్పటికీ హైకోర్టులు వాటిని పాటించడం లేదు. ఆ విషయంలో చాలామందికి ఆశ్చర్యం కన్నా ఆందోళన ఎక్కువ కలిగిస్తోంది. ఈ విషయం నుంచి కోర్టులు ఎప్పుడు బయట పడతాయో ఎదురుచూడాలి.
- మంగారి రాజేందర్, 
మాజీ డైరెక్టర్​, జ్యుడీషియల్​ అకాడమీ(ఉమ్మడి ఏపీ)