
హైదరాబాద్, వెలుగు : మేడిగడ్డ బ్యారేజీ కూలిన ఘటనపై గురువారం నుంచి జ్యుడీషియల్ కమిషన్ విచారణ జరపనుంది. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలను ఇవ్వాల్సిందిగా ఇరిగేషన్ అధికారులను కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆదేశించారు. బుధవారం జస్టిస్ ఘోష్ కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్‌సీ (జనరల్) అనిల్ కుమార్, ఈఎన్‌సీ (ఓఅండ్‌ఎం) నాగేందర్ రావు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనను రిసీవ్ చేసుకున్నారు. అనంతరం బీఆర్‌కే భవన్‌లో కాళేశ్వరం ఎంక్వైరీ కమిషన్ ఆఫీసుకు వచ్చారు. ఈ సందర్భంగా అధికారులతో పీసీ ఘోష్ భేటీ అయ్యారు. గురువారం ఉదయం ఇరిగేషన్ అధికారులతో ఆయన మరోసారి సమావేశం కానున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారం, ఫైళ్లను అందుబాటులో ఉంచుకోవాల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది. ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన అధికారులను అందుబాటులో ఉండాలని చెప్పినట్టు సమాచారం. అనంతరం ఆయన శుక్రవారం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనున్నట్టు అధికారులు చెప్పారు. దాంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలనూ పరిశీలించనున్నారని తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్ని బ్యారేజీల డీపీఆర్‌లు, డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్, ఓఅండ్‌ఎం, నిర్మాణ సంస్థల పనితీరు, కూలిపోయాక వాటికి రిపేర్లు చేయిం చడం, ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ పరిశీలనల గురించి కూడా ఆయన ఆరా తీసినట్టు తెలిసింది.