తాతగారి జీవితమే నాకు స్పూర్తి

తాతగారి జీవితమే నాకు స్పూర్తి

పెద్దవాళ్ల ఆశయాలు,ఆలోచనలు, వాళ్లు పడ్డ కష్టాలు  పిల్లలతో పంచుకున్నపుడే, వాళ్లకు ఏ దారిలో వెళ్లాలి, ఏం సాధించాలో తెలుస్తుంది. అలాగే ఆ విషయాలు పిల్లల్ని జీవితంలో పైకి తీసుకురావడానికి చాలా సాయపడతాయి. అలాంటిదే ఆక్స్‌‌ఫర్డ్‌‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌‌‌‌ పూర్తిచేసిన జూహీ కోర్‌‌‌‌ కథ కూడా. తన తాత గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, ఆయన చేయలేని పనిని చేసి చూపించింది జూహి.

జూహి సొంతూరు ముంబై. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేది. అందుకే తనను కష్టపడి పై చదువులు చదివించారు తల్లిదండ్రులు. వాళ్ల కష్టానికి తగ్గట్టే ఆక్స్‌‌ఫర్డ్‌‌ యూనివర్సిటీలో సీటు కూడా తెచ్చుకుంది. పొలిటికల్‌‌ సైన్స్‌‌లో గ్రాడ్యుయేషన్‌‌, కంపారిటివ్‌‌ సోషల్ పాలసీ సబ్జెక్ట్స్‌‌లో మాస్టర్స్‌‌ పూర్తి చేసింది. తను   చదువుకుంటూనే టెడ్‌‌ఎక్స్‌‌ టాక్‌‌ ఇచ్చింది. లండన్‌‌, సిలికాన్‌‌ వ్యాలీలో ఉన్న స్టార్టప్‌‌ కంపెనీలకు అడ్వైజర్‌‌‌‌గా, పొలిటికల్‌‌ అడ్వైజర్‌‌‌‌గా కూడా పని చేస్తోంది. మాస్టర్స్‌‌ పూర్తి చేసినపుడు గ్రాడ్యుయేషన్‌‌ సెర్మనీలో ‘నీకు స్పూర్తి ఎవరు?’ అని అడిగితే ‘మా తాతగారు. ఆయన జీవితమే నాకు స్పూర్తి’ అని చెప్పింది. ఆమె తాత గురించి లింక్డిన్‌‌ అకౌంట్‌‌లో స్టోరీ పోస్ట్‌‌ చేసింది. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్‌‌ అవుతోంది.

తాతను చూసి...
జూహి వాళ్ల తాత ముంబైలోనే పుట్టి పెరిగాడు. బాగా చదువుకుని, పెద్ద ఉద్యోగం చేయాలనేది ఆయన కోరిక. కానీ, అది నెరవేరలేదు. చదువుకోవడానికి స్కూల్‌‌కి వెళ్తే తక్కువ కులంలో పుట్టాడనే కారణంతో స్కూల్‌‌కి రానీయలేదు. అయినా పట్టువదలకుండా రోజూ కిలోమీటర్ల కొద్దీ నడిచి వేరే ఊళ్లో ఉన్న స్కూల్స్‌‌కి వెళ్లేవాడు. అక్కడా అదే పరిస్థితి. ‘మనలాంటి వాళ్లు చదువుకోవద్ద’ని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినేవాడు కాదు. రోజూ తల్లితో కలిసి ఆమె పని చేసే ఇండ్లకి వెళ్లేవాడు. యజమాని పిల్లల పాత పుస్తకాలు తీసుకొని చదివేవాడు. అలా చదువుతూ ప్రైవేట్‌‌గా ఫీజు కట్టి పదోతరగతి పూర్తి చేశాడు. ఇంటికి పెద్దవాడు కావడంతో కుటుంబ బాధ్యత అతని మీద పడింది. గవర్నమెంట్‌‌ ఆఫీస్‌‌లో ఆఫీస్‌‌బాయ్‌‌గా చేస్తూనే ఇంటర్మీడియెట్‌‌, లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తన చదువుకు తగ్గ ఉద్యోగం వెతుకుతూ ఎన్నో ఆఫీస్‌‌ల మెట్లు ఎక్కాడు. అక్కడ కూడా ‘నీ లాంటి వాళ్లకు ఇక్కడ ఉద్యోగాలు ఎవరిస్తార’ని బయటికి గెంటేసేవాళ్లు. చేసేదేంలేక కుటుంబ పోషణ కోసం కూరగాయల దుకాణం నడిపిస్తూ బతికాడని పోస్ట్‌‌లో రాసుకొచ్చింది జూహి.